Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్‌మెంట్

  • భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం
  • భర్త, అత్తకు వీఐపీ ట్రీట్‌మెంట్
  • భద్రతా కారణాలతో ప్రత్యేక ఏర్పాట్లు
Twisha Sharma

Twisha Sharma

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు నటి ట్విషా శర్మ కేసులో నిందితులుగా ఉన్న అత్త గిరిబాలాసింగ్, భర్త సమర్థ్‌‌సింగ్‌ జైల్లో రాజభోగం అనుభవిస్తున్నట్లుగా తెలుస్తోంది. భోపాల్ జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తులో ఉన్న ఈ కేసులో ఇద్దరూ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో భోపాల్ సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే సాధారణ ఖైదీల మాదిరిగా కాకుండా జైలు ఆస్పత్రిలో ఉంచి వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి.

మాజీ జిల్లా న్యాయమూర్తి అయిన గిరిబాలా సింగ్‌ను భద్రతా కారణాల పేరుతో జైలు ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. గతంలో తాను శిక్ష విధించిన ఖైదీలు అదే జైలులో ఉన్నారని.. తన ప్రాణాలకు ముప్పు ఉందని కోర్టును ఆశ్రయించారు. ఆమె వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుని భద్రత కల్పించాలని సూచించినట్లు తెలుస్తోంది. అలాగే ట్విషా భర్త సమర్థ్ సింగ్‌ను గాయాల కారణంగా జైలు ఆస్పత్రిలో ఉంచినట్లు సమాచారం. దీంతో తల్లి, కొడుకులిద్దరూ జైలు ఆస్పత్రిలోనే ఉండటం వివాదాస్పదంగా మారింది.

×
×
Ad

జూన్ 2న భోపాల్ సెంట్రల్ జైలులో భద్రత కల్పించాలని గిరిబాలా సింగ్ కోర్టును కోరారు. తన న్యాయ సేవా కాలంలో భోపాల్‌లో అనేక కేసులకు తీర్పులు ఇచ్చానని, ప్రస్తుతం అదే జైలులో ఉన్న కొందరు ఖైదీలు తన చేత శిక్షపడిన వారేనని పేర్కొన్నారు. అందువల్ల తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో తన కుమారుడు సమర్థ్ సింగ్‌పై ట్విషా కుటుంబం తరఫు న్యాయవాది దాడి చేశారని ఆరోపించారు. కేసు ప్రారంభం నుంచి తాము మీడియా ట్రయల్‌ను ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.

మీడియా కవరేజీపై అభ్యంతరం


సీబీఐ దర్యాప్తునకు సంబంధించిన విషయాలు మీడియాలో ఎక్కువగా రావద్దని గిరిబాలా సింగ్ కోర్టును కోరినట్లు సమాచారం. జైలు తరలింపు సమయంలో మీడియా నుంచి రక్షణ కల్పించాలని కూడా విజ్ఞప్తి చేసినట్లు న్యాయవాదులు తెలిపారు. ట్విషా కుటుంబం తరఫున వాదిస్తున్న న్యాయవాది అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. తమపై, మీడియా ప్రతినిధులపై జబల్‌పూర్ కోర్టు దగ్గర కొందరు న్యాయవాదులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. కోర్టులో జరిగిన ఘటనలపై సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాలని కూడా డిమాండ్ చేశారు.

కేసు నేపథ్యం


మే 12న భోపాల్‌లోని తన అత్తింట్లో ట్విషా శర్మ ఉరివేసుకుని మృతిచెందిన స్థితిలో కనిపించారు. ఆమె కుటుంబ సభ్యులు వరకట్న వేధింపులే మరణానికి కారణమని ఆరోపించారు. కేసు తీవ్ర సంచలనం రేపడంతో దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. సీబీఐ కస్టడీ ముగియడంతో ట్విషా భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాలా సింగ్‌లను కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.