Opposition meet: 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గద్దె దించడమే ప్రధాన ధ్యేయంగా గురువారం ప్రతిపక్షాలు పాట్నాలో బీహార్ సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన సమావేశమయ్యాయి. కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, ఎన్సీపీ, ఆర్జేడీ, వామపక్షాలతో సహా 17 ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు సమావేశానికి వచ్చారు. రాహుల్ గాంధీ, స్టాలిన్, మమతా బెనర్జీ, శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్ వంటి కీలక నేతలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తామంతా ఐక్యంగా ఉండి బీజేపీని ఓడిస్తామని ప్రతిపక్షాలు ప్రకటించాయి. అయితే నిన్న జరిగిన సమావేశంలో ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. తమ ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు సిమ్లాలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించాయి.
READ ALSO: Sikkireddy Mother: కేపీ చౌదరి మాకు తెలుసు.. కానీ ఎలాంటి వాడో మాకు తెలియదు
ఇదిలా ఉంటే ఈ సమావేశంపై బీజేపీ సెటైర్లు వేస్తోంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయితీ రాజ్ మంత్రి గిరిరాజ్ సింగ్ పాట్నా సమావేశంపై విమర్శలు గుప్పించారు. చాయ్ తాగి, బీహార్ ఫేమస్ లిట్టి చోఖా తిని వెళ్లారని ప్రతిపక్షాలను ఎగతాళి చేశారు. గడ్డం కత్తిరించుకుని పెళ్లి చేసుకోవాలని లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పారని ఎద్దేవా చేశారు. ఇది ఫోటో సెషన్ అని, తొలి ఫోటో సెషన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో నితీష్ కుమార్ నిర్వహిచారని.. ఇది రెండోదని విమర్శించారు. తుక్డే తుక్డే గ్యాంగ్ ప్రధాని కావాలని కలలు కంటోందని అన్నారు.
నాలుగు గంటల ప్రతిపక్ష పార్టీల సమావేశంలో మధ్యాహ్న భోజనంతో సహా నేతలంతా ఎంజాయ్ చేశారని.. లిట్టి చోఖా తిని, మాల్దా మామిడిపండ్లు తిన్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు గిరిరాజ్ సింగ్. పాట్నా సమావేశాన్ని తోడేళ్ల సమావేశంగా బీజేపీ వ్యాఖ్యానించింది. అంతకుముందు కేంద్ర మంత్రి అమిత్ షా..దీన్ని ఫోటో సెషన్ గా అభివర్ణించారు.