NTV Telugu Site icon

Rachana Banerjee: ‘‘ క్వింటాల్ క్వింటాల్ వాటర్’’.. ఒకప్పటి తెలుగు హీరోయిన్, ఎంపీపై ట్రోలింగ్..

Rachana Banerjee

Rachana Banerjee

Rachana Banerjee: ఒకప్పటి తెలుగు హీరోయిన్, ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీగా ఉన్న రచన బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్రోలింగ్‌కి గురవుతున్నాయి. బెంగాల్‌లో వరద ప్రాంతాలను సందర్శించి ఎంపీ ‘‘క్వింటాళ్ల నీరు’’ అని కామెంట్స్ చేయడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్, మీమ్స్‌కి దారి తీసింది. హుగ్లీ ఎంపీగా ఉన్న ఆమె మంగళవారం జిల్లాలోని వరద ప్రాంతాలను సందర్శించారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ‘‘క్వింటాళ్ల, క్వింటాళ్ల కొద్దీ నీరు వచ్చింది, ప్రజలకు ఇళ్లు లేవు. వారు వీధిన పడ్డారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Minister Payyavula: ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ పనితీరుపై మంత్రి పయ్యావుల సమీక్ష

నిజానికి నీటిని లీటర్లలో, పెద్ద మొత్తం నీటిని క్యూసెక్కులతో కొలుస్తారు. టీఎంసీ ఎంపీ క్వింటాల్‌ని నీటికి కొలమానంగా ఉపయోగించింది. క్వింటాల్ అనేది ఆహారధాన్యాల కొలమానంగా ఉపయోగించబడుతుంది. తెలుగులో కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన రచన, ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హుగ్లీ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ లాకెట్ ఛటర్జీని ఓడించి ఎంపీగా గెలిచారు.

అయితే, ఆమె కామెంట్స్‌పై నెటిజన్లు ఎగతాళి చేస్తున్నారు. ఓ యూజర్ తన పోస్టులో ‘‘ నీటిని క్వింటాళ్లలో కొలవవచ్చని ఈ రోజు నేర్చుకున్నా.. నేర్చుకోవడానికి అంతం లేదు’’ అని ఫన్నీగా కామెంట్ చేశారు. మరికొందరు ఆమెను అక్కడి ఓటర్లు ఎలా ఎన్నుకున్నారు..? అని ప్రశ్నించారు. అయితే, మరికొంత మంది యూజర్లు మాత్రం ఆమెకు మద్దతు నిలిచారు. టంగ్ స్లిప్ అయి ఈ వ్యాఖ్యలు చేసి ఉండచ్చని అన్నారు. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ నిర్వహించే డ్యామ్‌ల నుంచి నీటిని విడుదల చేయడం, భారీ వర్షాల కారణంగా దక్షిణ బెంగాల్‌లోని అనేక జిల్లాలు వరదలకు గురయ్యాయి. ఈ వరదల వల్ల బెంగాల్‌లో 28 మంది మరణించారని సీఎం మమతా బెనర్జీ చెప్పారు.