Site icon NTV Telugu

Sandeshkhali: సీబీఐతో కలిసి బీజేపీ కుట్ర.. సందేశ్‌ఖాలీ రైడ్స్‌పై ఈసీకి తృణమూల్ ఫిర్యాదు..

Mamata Banerjee

Mamata Banerjee

Sandeshkhali: లోక్‌సభ ఎన్నికల ముందు పశ్చిమ బెంగాల్‌లో సందేశ్‌ఖాలీ సంఘటన దేశవ్యాప్తంగా రాజకీయ అంశంగా మారింది. అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలు, కార్యకర్తలు అక్కడి మహిళలపై లైంగిక అఘాయిత్యాలు, భూ కబ్జాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన షేక్ షాజహాన్‌ని 55 రోజుల పరారీ అనంతరం, కలకత్తా హైకోర్టు కలుగజేసుకోవడంతో బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ విచారిస్తోంది.

ఇదిలా ఉంటే శుక్రవారం సందేశ్‌ఖాలీ ప్రాంతంలో సీబీఐ భారీగా సోదాలు నిర్వహించింది. టీఎంసీ నేత బంధువు ఇంట్లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, బాంబులు పట్టుబడ్డాయి. అయితే, దీనిపై తృణమూల్ కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. పోలింగ్ రోజున సీబీఐ కావాలనే దాడులు సోదాలు నిర్వహించిందని చెప్పింది. పార్టీ ప్రతిష్ట దెబ్బతీసేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. సీబీఐ, బీజేపీ కలిసి కుట్ర పన్ని ఈ సోదాలు నిర్వహించాయని తృణమూల్ శనివారం కేంద్రం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. టీఎంసీ ప్రతిష్టను దిగజార్చడానికి సీబీఐ అశాస్త్రీయంగా దాడి నిర్వహించిందని ఫిర్యాదు చేసింది.

Read Also: KCR: సోష‌ల్ మీడియాలో అడుగుపెట్టిన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్..

సోదాల్లో దొరికిన ఆయుధాలు నిజంగా స్వాధీనం చేసుకుందా..? లేదా..? అనే అనుమానాన్ని ఆ పార్టీ వ్యక్తపరిచింది. ఈ విషయంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా రాష్ట్రపరిధిలోకి వచ్చే అంశమని, అయినప్పటీకీ సీబీఐ రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు అధికారులుకు ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయలేదని టీఎంసీ వ్యాఖ్యానించింది. సందేశ్‌ఖాలీ హింసలో కీలక సూత్రధారి మాజీ టీఎంసీ నేత షేక్ షాజహాన్ అనుచరుడి ప్రాంగణంలో సర్వీస్ రివాల్వర్, విదేశీ తుపాకులు, ఆయుధాలు లభించాయి.

రేషన్ కుంభకోణంలో భాగంగా విచారణకు వెళ్లిన ఈడీ అధికారులపై అప్పటి టీఎంసీ నేత షేక్ షాజహాన్, అతని అనుచరులు జనవరిలో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన తర్వాత అక్కడి మహిళలపై లైంగిక వేధింపులు, భూకబ్జా, హింస ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. ఈ ఘటన తర్వాత 55 రోజుల వరకు కీలక నిందితుడు షేక్ షాజహాన్ పరారీలో ఉన్నాడు. చివరకు ఫిబ్రవరి 29న బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించలని బీజేపీ నాయకుడు సువేందు అధికారి శుక్రవారం కోరారు. సందేశ్ ఖాలీలో దొరికిన ఆయుధాలన్నీ విదేశాలకు చెందినవే అని, ఆర్డీఎక్స్ వంటి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారని, ఈ ఆయుధాలన్నింటిని అంతర్జాతీయ టెర్రరిస్టులు వాడుతున్నారని ఆరోపించారు. సందేశ్ ఖాలీ ఘటనకు పూర్తి బాధ్యత మమతా బెనర్జీదే అని అన్నారు. ఆమెను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Exit mobile version