Site icon NTV Telugu

Sandeshkhali: టీఎంసీ నేతలే బీజేపీ లక్ష్యం.. సందేశ్‌ఖలీ అల్లర్లకు ఆర్ఎస్ఎస్ కారణమన్న మమతా బెనర్జీ..

Trinamool Congress

Trinamool Congress

Sandeshkhali: పశ్చిమ బెంగాల్ సందేశ్‌ఖలీ అట్టుడుకుతోంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత షేక్ షాజహాన్, అతని అనుచరులు చేసిన అఘాయిత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వీరిపై అక్కడి మహిళలు చీపుళ్లు, కర్రలతో ఎదురుతిరిగారు. దీంతో ఒక్కసారిగా ఈ చిన్న గ్రామం జాతీయ వార్తల్లో ప్రధానాంశంగా మారింది. మహిళలు, యువకులు చేస్తున్న ఈ ఆందోళనలకు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ మద్దతు ఇచ్చింది. బీజేపీ చీఫ్ మజుందార్, ఇతర నేతలు టీఎంసీ గుండాలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనల్లో పాల్గొంటున్నారు.

Read Also: Sivakarthikeyan: శివకార్తికేయన్-ఏఆర్ మురుగదాస్ సినిమా షూటింగ్ ప్రారంభం..

ఇదిలా ఉంటే, సందేశ్‌ఖలీపై టీఎంసీ చీఫ్, సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఆ ప్రాంతంలో అశాంతికి ఆర్ఎస్ఎస్ కారణమని దుయ్యబట్టారు. బీజేపీ లక్ష్యం కేవలం టీఎంసీ లీడర్లే అని అన్నారు. ఈ కేసులో నిందితులుగా తేలితే తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. నేను ఎవరికీ అన్యాయం జరగనివ్వనని ఆమె అన్నారు. సందేశ్‌ఖలీకి తమ ప్రభుత్వం మహిళా కమిషన్‌ని పంపిందని, పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశామని, 17 మందిని అరెస్ట్ చేసినట్లు ఆమె వెల్లడించారు.

షేక్ షాజహాన్ అకృత్యాలకు నిరసనగా వరసగా ఏడో రోజు సందేశ్‌ఖలీలో ఆందోళనలు మిన్నంటాయి. బుధవారం బీజేపీ చీఫ్ మజుందార్ మహిళలకు సంఘీభావం ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాటలో ఆయనకు గాయాలయ్యాయి. షాజహాన్, అతని అనుచరులు బలవంతగా ప్రజల భూముల్ని స్వాధీనం చేసుకుని, మహిళలను లైంగికంగా వేధించారని ఆరోపించారు. రేషన్ కుంభకోణంలో ఈడీ దర్యాప్తు సందర్భంగా అధికారులపై జనవరి 5న షేక్ షాజహాన్ అతని గుండాలు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన తర్వాత నుంచి అతను పరారీలో ఉన్నాడు. బంగ్లాదేశ్ పారిపోయాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతనికి రాష్ట్రంలోని టీఎంసీ ప్రభుత్వం, సీఎం మమతా మద్దతు ఇస్తోందని బీజేపీ ఆరోపించారు.

Exit mobile version