NTV Telugu Site icon

Toll-Free Entry: ముంబై నగరంలోకి ప్రవేశించే ఈ వాహనాలకు టోల్ ఫ్రీ ఎంట్రీ.. మండిపడిన విపక్షాలు

Shinde

Shinde

Toll-Free Entry: అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై నగరంలోకి ప్రవేశించే టోల్‌ ప్లాజాల దగ్గర లైట్‌ మోటార్‌ వాహనాలకు ఇకపై టోల్‌ ఫీజు వసూలుచేయబోమని వెల్లడించింది. కార్లు, ఎస్‌యూవీలకు మాత్రమే ఈ నిర్ణయం వర్తిస్తుందని చెప్పుకొచ్చింది. ఈరోజు (సోమవారం) అర్ధరాత్రి నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు. కాగా, త్వరలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ ప్రకటనకు అధిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఇవాళ (సోమవారం) రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. థానే నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న షిండే.. గతంలో చాలాసార్లు టోల్‌ వసూళ్లకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఇప్పుడు వాటిని ఎత్తి వేస్తూ డిసిషన్ తీసుకున్నారు.

Read Also: Diwali release : దీపావళి రేసులో అరడజను సినిమాలు.. సౌండ్ చేసేదెవరు..?

అయితే, తాజా నిర్ణయంతో వాహనదారులకు ఐదు టోల్‌ప్లాజాల దగ్గర టోల్‌ రుసుముల నుంచి విముక్తి దొరికినట్లైంది. దహిసర్‌, ములుంద్‌, వాషి, ఐరోలి, తిన్హంత్‌ నాకాల్లో కార్లు, ఎస్‌యూవీలకు ఎలాంటి ఛార్జ్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక్కడ, ప్రస్తుతం టోల్‌ ఫీజుగా 45 రూపాయలు వసూలు చేస్తున్నారు. ముంబై నగరంలోకి చిన్న వాహనాలతో ప్రవేశించే రోజువారీ ప్రయాణికులకు ఇది ఊరట కలిగించే నిర్ణయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సీఎం ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వానికి ఇదే చివరి కేబినెట్ సమావేశం. అయితే, మహారాష్ట్ర స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ పేరును కూడా మార్చుతూ ఈ మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కన్నుమూసిన పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా గౌరవార్థం ఈ విశ్వ విద్యాలయానికి ఆయన పేరును పెట్టారు. ‘రతన్‌ టాటా స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ’గా దీనిని మార్చుతు మహారాష్ట్ర సర్కార్ గెజిట్ జారీ చేసింది.

Read Also: Hassan Nasrallah: నస్రల్లా చనిపోయిన 2 వారాల తర్వాత హిజ్బుల్లా ఆడియో సందేశం రిలీజ్..

ఇక, మరోవైపు సీఎం ఏక్‌నాథ్‌ షిండే సర్కార్ టోల్‌ రుసుములు తొలగిస్తూ తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఎన్నికలకు ముందు ఇది పొలిటికల్‌ స్టంట్‌ అని విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలో ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య ఘటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని శివసేన (యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది ఆరోపణలు చేశారు. మహారాష్ర్ట, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ‘కేంద్ర ఎన్నికల సంఘం’ ఈ వారంలో ప్రకటించే ఛాన్స్ ఉందని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. నవంబర్ రెండు లేదా మూడో వారంలో ఎన్నికలు జరిగేలా ఎన్నికల కమిషన్ సిద్ధమైనట్లు సమచారం. వీటితో పాటు వివిధ రాష్ర్టాల్లోని 45 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు సైతం జరగనున్నాయి. ఇందులోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజీనామా చేసిన కేరళలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఉండనుంది.