TMC crisis: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పటికీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆ నిజాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. గతంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుండా మొండిగా వ్యవహరించినట్లే, ఇప్పుడు ప్రజా తీర్పును కూడా ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో ఆమె తన అధికారిక ‘X’ బయోలో ‘మాజీ ముఖ్యమంత్రి’ అని రాసుకోవడానికి ఇష్టపడలేదు. దానికి బదులుగా.. “ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి (15, 16, 17వ అసెంబ్లీ)” అని పేర్కొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
“ఓటమిని అంగీకరించకపోతే నవ్వులపాలు అవుతాం”
పార్టీ వైఫల్యంపై టీఎంసీ అంతర్గత సమావేశాల్లోనే వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. “మనం ఓటమిని అంగీకరించి, పార్టీని మళ్లీ కింది స్థాయి నుంచి నిర్మించుకోవాలి. వాస్తవాలను తిరస్కరిస్తే ప్రజల్లో మనం నవ్వులపాలవుతాం. నాయకత్వమే బాధ్యత తీసుకోకపోతే, క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఎలాంటి సందేశం వెళ్తుంది?” అని ఒక టీఎంసీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అయితే మమతా బెనర్జీ మాత్రం సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన విమర్శలను పట్టించుకోవడం లేదని అంటున్నారు. అలాగే టీఎంసీ అంతర్గత సమావేశాల్లో ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీల ముందే తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారని సమాచారం.
టీఎంసీ సీనియర్ నేత కాకోలి ఘోష్ దస్తీదార్ తన జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ నాయకత్వానికి గట్టి చరకలు అంటించారు. ఈ సందర్భంగా కాకోలి ఘోష్ మాట్లాడుతూ.. పార్టీ మరింత పారదర్శకంగా, నిజాయితీగా ఉండాలని హితవు పలికారు. I-PAC వంటి సంస్థల మితిమీరిన జోక్యం, సంస్థాగత అవినీతికి నిరసనగానే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. లోక్‌సభలో టీఎంసీ విప్ పదవి నుంచి తనను తొలగించి, కళ్యాణ్ బెనర్జీకి ఆ బాధ్యతలు ఇవ్వడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 40 ఏళ్ల విశ్వసనీయతకు పార్టీ ఇచ్చిన బహుమతి ఇదేనా అని ఆమె ప్రశ్నించారు. ఇదే సమయంలో ఫల్తా నియోజకవర్గంలో ఎన్నికల కంటే ముందే టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ తప్పుకోవడం తీవ్ర దుమారం రేపింది. అభిషేక్ బెనర్జీకి అత్యంత ఆప్తుడైన జహంగీర్ ఖాన్‌పై పార్టీ వ్యతిరేక చర్యల కింద ఎందుకు సస్పెన్షన్ వేటు వేయలేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు.
సమావేశానికి 15 మంది ఎమ్మెల్యేల డుమ్మా:
మమతా బెనర్జీ స్వయంగా హాజరైన కీలక సమావేశానికి 15 మంది ఎమ్మెల్యేలు లేనిపోని కారణాలతో దూరంగా ఉండటం పార్టీలో క్రమశిక్షణారాహిత్యాన్ని సూచిస్తోందని విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు. అభిషేక్ బెనర్జీ పనితీరుపై సీనియర్లు బహిరంగంగానే పెదవి విరుస్తున్నారు. సభలో విపక్ష నేతగా అత్యంత అనుభవజ్ఞుడైన శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయను మమత ఎంపిక చేశారు. అయితే, టీఎంసీ నుంచి గెలిచిన 80 మంది ఎమ్మెల్యేలలో కేవలం 65 మంది మాత్రమే ఈ ప్రతిపాదనపై సంతకాలు చేయడం విశేషం. మిగిలిన 15 మంది దీనికి దూరంగా ఉన్నారు.
పార్టీలో తిరుగుబాటు స్వరాలు వినిపిస్తున్నప్పటికీ మమత తనదైన శైలిలో వాటిపై స్పందిస్తున్నారు. “వేరే పార్టీల్లోకి వెళ్లేవారిని వెళ్లనివ్వండి.. నేను పార్టీని మళ్లీ కొత్తగా నిర్మిస్తా. నాతో ఉన్నవారు ధ్వంసమైన పార్టీ ఆఫీసులను బాగు చేయండి, రంగులు వేసి మళ్లీ తెరవండి. అవసరమైతే నేనే స్వయంగా వచ్చి ఆఫీసులకు పెయింట్ వేస్తా. టీఎంసీ ఎప్పటికీ లొంగిపోదు” అని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. అలాగే వెన్నుపోటు పొడిచిన వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తానని హెచ్చరించారు. “నన్ను చూసి నాకే నవ్వొస్తోంది.. నేను బీజేపీని నైతికంగా ఓడించాను. ఇప్పుడు నేను స్వేచ్ఛా పక్షిని. అందరి కోసం పనిచేశాను.. ఓడిపోయి ఉండవచ్చు, కానీ పోరాటం మాత్రం ఆపను” అని ఆమె అన్నారు.
