Tiger attack in Maharashtra.. Two killed: మహారాష్ట్రలో పులులు బీభత్సం సృష్టిస్తున్నాయి. చంద్రపూర్ జిల్లాలో ఇద్దరు పశువుల కాపర్లపై దాడి చేసి హతమార్చింది ఓ పెద్దపులి. జల్లాలోని మూతాలాకా చించాడా గ్రామానికి చెందిన నానాజీ నీకేసర్(53), దివరూ వసలేకర్(55) ఇద్దరు పశువులను మేపేందుకు సమీపంలో అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఈ సమయంలో వీరిద్దరిపై పులి పంజా విసిరింది. దీంతో వారిద్దరు మరణించారు. దీంతో స్థానికంగా ఉన్న గ్రామస్థులు భయాందోళనకు గురువుతున్నారు.
ఇటీవల కాలంలో చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల్లో వరసగా పలువురు పులుల దాడులకు గురువుతున్నారు. పశువులను వేటాడి చంపేస్తున్నాయి పులులు. దీంతో పాటు సరిహద్దుల్లో ఉన్న కొమురంభీం జిల్లాలో కూడా పులుల సంచారం పెరిగింది. అటవీ ప్రాంతాలకు సరిహద్దుల్లో ఉన్న గ్రామాల ప్రజలు పులుల భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. గత వారం చంద్రపూర్ జిల్లాలో 13 మందిని చంపిన పెద్దపులిని అటవీ అధికారులు పట్టుకున్నారు. దీని తర్వాత వారం తిరగకముందే మరో పులి ఇద్దరిని పొట్టన పెట్టుకుంది. ఇదిలా ఉంటే కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ మండలం వెంపల్లిలో పశువుల మందపై పులి దాడి చేసింది. రెండు పశువులను హతమార్చింది.
Read Also: Russia-Ukraine War: భారతీయులు వెంటనే ఉక్రెయిన్ వదలిపెట్టండి
మహారాష్ట్రలోని చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల అటవీ ప్రాంతంలో తాడోబా-అంధరి టైగర్ రిజర్వ్ ఉంది. పులుల ఆవాసానికి తాడోబా అనుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రపూర్ జిల్లాలో పలు అటవీ గ్రామాల్లోని ప్రజలపై పులులు దాడులు చేస్తుంటాయి. ఇదిలా ఉంటే తాడోబా నుంచి తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ కు పులులు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రత్యేకంగా టైగర్ కారిడార్ ఉంది. దీంతో దీనికి అనుకుని ఉన్న గ్రామాలపై తరుచుగా పులులు దాడులు చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే తెలంగాణలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాచలం అడపాదడపా పులుల సంచారం కనిపిస్తోంది. భూపాలపల్లి, ములుగు జిల్లాలకు సరిహద్దులను ఆనుకుని మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇటు మహారాష్ట్రలో తాడోబా టైగర్ రిజర్వ్ ఉండగా.. చత్తీస్ గఢ్ బీజీపూర్ జిల్లాలో ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఉంది. ఈ రాష్ట్రాలను వేరు చేస్తూ.. గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నదులు ప్రవహిస్తున్నాయి. ఈ నదులను దాటుకుని తెలంగాణలోకి పులుల వస్తున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు.