Site icon NTV Telugu

Karnataka: 5 పులుల మృతి కేసులో ముగ్గురు అరెస్ట్.. ఎందుకు చంపారంటే..!

Karnatakatigers

Karnatakatigers

కర్ణాటకలో ఒకేసారి ఐదు పులులు మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది. పోస్ట్‌మార్టం రిపోర్టులో విషాహారం తిని చనిపోయినట్లుగా తేలింది. దీంతో ఎవరో కావాలనే ఈ పని చేసి ఉంటారని ఫారెస్ట్ అధికారులు భావించారు. అంతేకాకుండా రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే కూడా సీరియస్‌గా తీసుకున్నారు. అవి సహజ మరణాలు కావని.. ఎవరో చంపారని పేర్కొన్నారు. దర్యాప్తు చేసి మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు.. సమీప గ్రామస్తులను విచారించగా ఈ ఘాతుకానికి పాల్పడ్డ ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: Swetcha’s father: నా కూతురు చావుకు అతడే కారణం.. స్వేచ్ఛ తండ్రి సంచలన ఆరోపణలు..

కర్ణాటకకు చెందిన మాదురాజు అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరిని ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. తమ ఆవును పులి వేటాడి చంపినందుకు ప్రతీకారంగా పులులకు విషం పెట్టినట్లు నిందితుడు అధికారుల ముందు ఒప్పుకున్నాడు. స్నేహితులు కోనప్ప, నాగరాజుల సాయంతో ఈ పని చేసినట్లుగా అంగీకరించాడు. చనిపోయిన తన ఆవు కళేబరంపై విషం చల్లి.. దానిని అడవికి సమీపంలో పడేసినట్లు తెలిపారు. ఆ విష కళేబరాన్ని తిన్న తల్లి పులి, దాని నాలుగు పిల్లలు ప్రాణాలు కోల్పోయాయని చెప్పాడు. ఇక తదుపరి విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Naga chaitanya: శోభితతో జీవితం సంతోషంగా సాగుతుంది..

ఇదిలా ఉంటే విషయం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ఘటనపై పూర్తి నివేదిక అందిన తర్వాత నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రేకు సూచించారు.

మలేమహదేశ్వర హిల్స్‌లోని హూగ్యం అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఒకేసారి ఐదు పులులు చనిపోవడం కర్ణాటక చరిత్రలోనే తొలిసారి. దీంతో ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మొత్తానికి నిందితులను అరెస్ట్ చేశారు. కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో 563 పులులు ఉన్నాయి. మధ్యప్రదేశ్ తర్వాత అంత ఎక్కువగా ఉన్నది కర్ణాటకలోనే. ఈ పులుల సంరక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా… సమీప గ్రామస్తులు విషప్రయోగంతో చంపేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు.

Exit mobile version