Mangoes On EMI: మొబైల్ ఫోన్లు, కార్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లకు ఈఎంఐల్లో కొనుగోలు చేయడం విన్నాం. కానీ మామిడి పండ్ల కొనుగోలుకు ఈఎంఐ ఆఫర్ ఎప్పుడైనా విన్నారా..? అయితే ఓ సారి ఈ స్టోరిని చదవాల్సిందే. వేసవి వచ్చిందంటే చాలు ప్రతీ ఒక్కరు మామిడి పండ్లను టేస్ట్ చేయాలని చూస్తుంటారు. అంతటి క్రేజ్ ఉంది మామిడికి. అందులో కొన్ని రకాలయితే వరల్డ్ ఫేమస్. ఆల్పోన్సో మామిడి రకాన్ని ఈఎంఐ పద్దతిలో కస్టమర్లకు అందించేందుకు ఓ వ్యాపారి సిద్ధం అయ్యారు.
Read Also: Covid 19: పెరుగుతున్న కరోనా కేసులు.. ఈ మూడు రాష్ట్రాల్లో మాస్కులు తప్పనిసరి..
మంచి వాసన, సూపర్ టేస్ట్ ఉండే ఆల్పోన్సో మామిడికి చాలా ఎక్కువ ధర ఉంటుంది. కేవలం ఒక డజన్ మామిడి పండ్లకే రూ.500-1300 మధ్య ఉంటుంది. దీంతో చాలా మంది కస్టమర్లు ఈ పండ్లను కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసమే పూణే వ్యాపారి ఈఎంఐ పద్దతిని తీసుకువచ్చారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా గత 2-3 ఏళ్లలో మార్కెట్లు కుప్పకూలాయి. అయితే ఈ ఏడాది మామిడికాయల విక్రయదారులు మంచి రాబడుల కోసం ప్రయత్నిస్తున్నారు.
మహారాష్ట్రలోని సింధ్ దుర్గ్ జిల్లా దేవ్ ఘర్, రత్నగిరి జిల్లాలో దొరకే ఆల్ఫాన్సో రకం మామిడి పండ్లను అమ్మేందుకు పూణేకు చెందిన గురు కృప ట్రేడర్స్ యజమాని గౌరవ్ సనాస్ వినూత్న ఆలోచన చేశారు. తమ దుకాణంలో దొరికే మామిడి పండ్లను క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసి ఈఎంఐ పద్దతిలో కొనుగోలు చేయవచ్చని ప్రకటించారు. రూ. 5000 అంత కన్నా ఎక్కువ విలువ చేసే పండ్లను కొనుగోలు చేస్తే ఈ సదుపాయం ఉందని గౌరవ్ వెల్లడించారు. ఈఎంఐ పద్దతిలో మూడు, ఆరు, 12 నెలల వారీగా వాయిదాల్లో చెల్లించే వెసులుబాటును కల్పించారు.