Arvind Kejriwal: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలును వ్యతిరేకిస్తూ, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చిన శరణార్థుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కి నిరసన సెగ తగిలింది. తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ హిందూ, సిక్కు శరణార్థులు కేజ్రీవాల్ ఇంటి నివాసం వద్ద నిరసనకు దిగారు. అయితే వీరిని ‘పాకిస్తానీలు’ అని పిలిచి మరో వివాదానికి తెరలేపారు.
‘‘ఈ పాకిస్తానీల దుస్సాహనం. ముందు మనదేశంలోకి అక్రమంగా చొరబడి మన చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. వారు జైల్లో ఉండాల్సింది. మన దేశంలో ఆందోళనలు రేకెత్తించే ధైర్యం వారికి ఉందా..? సీఏఏ అమలు తర్వాత, పాకిస్తానీుల, బంగ్లాదేశీలు వ్యాప్తి చెందుతారు. దేశమంతటా ప్రజలను వేధింపుకు గురిచేస్తారు. బీజేపీ తన స్వార్థ ప్రయోజనాలక కోసం దేశం మొత్తాన్ని తమ ఓటు బ్యాంకుగా మార్చుకుని ఇబ్బందులకు గురిచేస్తోంది’’ అంటూ శుక్రవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అంతకుముందు గురువారం ఎక్స్‌లో మరో పోస్టులో ‘‘ఈ రోజు కొంతమంది పాకిస్తానీలు నా ఇంటి ముందు ప్రదర్శన చేసి, హంగామా సృష్టించారు, ఢిల్లీ పోలీసులు వారికి పూర్తి మద్దతు ఇచ్చారు. మనదేశంలోకి ప్రవేశించి వారు ఢిల్లీ ప్రజల భారీ ఆదేశంతో ఎన్నికైన సీఎంని క్షమాపణ చెప్పమని కోరుతున్నారని, బీజేపీ వారికి మద్దతు ఇస్తోందని, నాపై ద్వేషంతో బీజేపీ పాకిస్తానీలకు అండగా నిలుస్తోందని, దేశానికి ద్రోహం చేస్తుందని విమర్శించారు.
Read Also: Electoral Bonds Case: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఒక్క రూపాయి కూడా దక్కని పార్టీ బీఎస్పీ
రోహిణి, ఆదర్శ్ నగర్, సిగ్నేచర్ బ్రిడ్జి సమీపంలోని మజ్ను కా తిల్లాలో నివసిస్తున్న హిందూ మరియు సిక్కు శరణార్థులు నిరసనల్లో పాల్గొన్నారు. సీఏఏకి వ్యతిరేకంగా కేజ్రీవాల్ తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని, క్షమాపణలు చెప్పాలని కోరారు. మాకు ఇళ్లు, ఉద్యోగాలు ఎవరిస్తారని కేజ్రీవాల్ ప్రశ్నిస్తున్నాడు, నరేంద్రమోడీ ప్రభుత్వం మాకు పౌరసత్వం ఇస్తోందని, ఇన్నాళ్లు మా బాధను ఎవరూ అర్థం చేసుకోలేదని పంజూరామ్ అనే శరణార్థి వాపోయారు. అంతకుముందు, బీజేపీ దేశంలోని ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్‌లోని మైనారిటీ వర్గాలకు చెందిన పేద ప్రజలను సిఎఎ ద్వారా స్థిరపరచాలని మరియు తమకు ఓటు బ్యాంకును సృష్టించుకోవాలని కోరుకుంటోందని కేజ్రీవాల్ బుధవారం ఆరోపించారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడుతున్న వారికి ఉద్యోగాలు, ఇళ్లు ఇస్తామని, స్థానికులపై ప్రభావం పడుతుందని ఆరోపించారు.
డిసెంబర్ 31, 2014కి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మతపరమైన హింసను ఎదుర్కొని భారత్‌కి వచ్చిన హిందూ, క్రిస్టియన్, పార్సీ, బౌద్ధ, సిక్కు వంటి ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం ఇచ్చేందుకు ఇటీవల సీఏఏను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, విపక్షాలు మాత్రం బీజేపీ వారిని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకునేందుకు ప్రయత్ని్స్తోందని ఆరోపిస్తున్నాయి.