Amit Shah: ‘హిందీ’ భాషపై తమిళనాడు, కేంద్రం మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలో శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. భాష పేరుతో దేశంలో ఇప్పటికే తగినంత విభజనలు జరిగాయి, ఇకపై అది జరగకూడదు’’ అని ఆయన అన్నారు. జాతీయ విద్యా విధానంలో(ఎన్‌ఈపీ)లో భాగంగా త్రిభాష సూత్రం అమలుపై తమిళనాడుతో పెరుగుతున్న వివాదం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్ని పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం భాషా సమస్యల్ని తీసుకువస్తున్నాయని ఆరోపించారు.
Read Also: Hyderabad: భారీగా కుళ్లిన మేక, గొర్రె మాంసం స్వాధీనం.. ఇక హలీమ్, బిర్యానీలు తిన్నట్లే!
రాజ్యసభలో ప్రసంగించిన అమిత్ షా, ప్రతీ భారతీయ భాష దేశానికి ఒక నిధి లాంటిదని అన్నారు. హిందీ ఏ భారతీయ భాషతోనూ పోటీ పడదని, అది ఇతర భాషలకు స్నేహితుడు మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. డిసెంబర్ నుంచి రాష్ట్రాలతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కమ్యూనికేషన్లు వారి సొంత భాషల్లోనే జరుగుతాయని రాజ్యసభకు తెలియజేశారు.
ఇటీవల, త్రిభాష విధానంపై తమిళనాడు ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేసింది. ‘‘హిందీ’’ని బలవంతంగా తమ రాష్ట్రంపై రుద్దేందుకు కేంద్ర ప్రయత్నిస్తోందని, ఇది ఆర్ఎస్ఎస్ ప్లాన్ అంటూ డీఎంకే ప్రభుత్వం, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు. తమిళనాడులో తమిళం, ఇంగ్లీష్ ద్విభాషా విధానాన్ని మాత్రమే అమలు చేస్తామని చెప్పారు. అయితే, హిందీని ఏ రాష్ట్రంపై రద్దడం లేదని కేంద్రం చెబుతోంది.