NTV Telugu Site icon

కరోనా పెను సవాల్‌గా మారింది.. క‌ట్ట‌డికి ఉమ్మ‌డి వ్యూహం అవ‌స‌రం..

PM Modi

కరోనా పెను సవాల్‌గా మారింది.. దానిపై జరిపే పోరాటంలో విజయం సాధించడానికి ఉమ్మడి వ్యూహం, ప్రయత్నం అవ‌స‌రం అన్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. క‌రోనా పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇవాళ రాష్ట్ర, జిల్లా అధికారులతో మాట్లాడారు.. కోవిడ్ పై చేసిన యుద్ధంలో మోడీ నాయ‌క‌త్వానికి ఈ స‌మావేశంలో కృతజ్ఞతలు తెలిపారు అధికారులు.. ఆయా జిల్లాల్లో క‌రోనా పరిస్థితి మెరుగుపడటం గురించి ప్రధానికి వివ‌రించారు.. రియల్ టైమ్ పర్యవేక్షణ, సామర్థ్యం పెంపు కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్న తీరును, అనుభవాన్ని ప్రధానితో పంచుకున్నారు. తమ జిల్లాల్లో ప్రజల భాగస్వామ్యం, అవగాహన పెంచడానికి తీసుకున్న చర్యల గురించి కూడా ప్రధానికి తెలియజేశారు అధికారులు.

ఇక‌, మహమ్మారిపై పోరాడటానికి ప్రతి ఒక్కరూ పూర్తి నిబద్ధతతో ఉండేలా చూడాలని కోరారు ప్ర‌ధాని మోడీ.. కరోనా పెను సవాలుగా మారిందన్న ఆయ‌న‌.. కొత్త సవాళ్ల మధ్య, కొత్త వ్యూహాలు, పరిష్కారాలు అవ‌స‌రం అన్నారు.. ఇటీవల దేశంలో యాక్టివ్ కేసులు తగ్గడం ప్రారంభమైందని గుర్తు చేసిన ఆయ‌న‌.. ఇన్ఫెక్షన్ స్వల్ప స్థాయిలో ఉన్నప్పటికీ , కరోనా వైరస్ ఉన్నంతవరకు ఈ సవాలును ఎదుర్కోవాలని హెచ్చ‌రించారు.. ఇదే స‌మ‌యంలో.. మహమ్మారిని ఎదుర్కోవడంలో రాష్ట్ర, జిల్లా అధికారుల కృషిని ప్ర‌శంసించారు. కరోనాను ఎదుర్కొనడంలో ఆచరణాత్మక, సమర్థవంతమైన విధానాలను రూపొందించడంలో అధికారుల అనుభవాలు, అభిప్రాయాలు బాగా సహాయపడ్డాయన్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. అన్ని స్థాయిలలో రాష్ట్రాలు, వివిధ వర్గాల సలహాలను కూడా పరిగణన లోకి తీసుకుని టీకా వ్యూహాన్ని అమలు చేయనున్నట్లు వెల్ల‌డించారు.

క్షేత్ర స్థాయిలో స్థానిక అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, అన్ని వ్యవస్థలు కలిసి పనిచేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు ప్ర‌ధాని మోడీ.. కేసులు తగ్గుతున్నప్పటికీ గ్రామాలను కరోనా రహితం చేయాలని కోరిన ఆయ‌న‌.. కరోనాను ఎదుర్కొనడానికి గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు నిర్దిష్ట వ్యూహాన్ని రూపొందించాల‌ని అధికారుల‌ను కోరారు. ప్రస్తుత కరోనా వైరస్ విజృంభ‌ణ నేప‌థ్యంలో అంటువ్యాధులను ఎదుర్కోవడంలో దేశ నైపుణ్యాన్ని పెంచిందని తెలిపారు.. కరోనా వైరస్ మ్యుటేషన్, ఫార్మాట్ మార్చుతోంది కాబట్టి మహమ్మారిని ఎదుర్కోవడంలో పద్ధతులు, వ్యూహాలు డైనమిక్‌గా ఉండాల‌న్నారు.. టీకా డ్రైవ్ వేగాన్ని పెంచాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ప్రధాని.. ఒక వ్యాక్సిన్ వృథా చేయడం అంటే ఒక వ్యక్తికి ఆరోగ్య భద్రతను అందించలేకపోవడంగా గుర్తించాల‌న్నారు. వ్యాక్సిన్ వృథా చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరారు. పేదలకు ఉచిత రేషన్ కోసం సౌకర్యాలు, ఇతర నిత్యావసర వస్తువులు తప్పనిసరిగా అందించాలి, బ్లాక్ మార్కెటింగ్ ఆపాలని కోరిన ప్రధాని.. కరోనా పై జరిపే పోరాటంలో విజయం సాధించడానికి ఉమ్మడి వ్యూహం, ప్రయత్నం అవ‌స‌రం అన్నారు.