VHP Rally: హర్యానా రాష్ట్రంలోని నుహ్ జిల్లాలో విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. కొందరు వ్యక్తులు పలు వాహనాలకు నిప్పు పెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. బీజేపీ అధికారంలో ఉన్న హర్యానా లోని నుహ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వీహెచ్‌పీ కార్యకర్తలు జలాభిషేకం యాత్రను చేపట్టారు. సోమవారం ఆ ర్యాలీ నంద్ గ్రామానికి చేరుకోగా కొందరు వ్యక్తులు ర్యాలీపైకి రాళ్లు రువ్వారు. ఈ యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పలు వాహనాలకు నిప్పుపెట్టారు. స్పందించిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దేందుకు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. అలాగే కాల్పులు కూడా జరిపారు. ఈ సంఘటనలో పలువురు గాయపడ్డారు. కాల్పుల్లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read also: Vikarabad: రూ.50 కోసం హత్య చేసిన కేసులో నిందితుడికి రూ.1000 జరిమానా
గో రక్షణ దళం, బజరంగ్ దళ్‌కు చెందిన మోను మనేసర్ రెండు రోజుల కిందట ఒక వీడియో విడుదల చేశాడు. ఈ యాత్రలో పాల్గొనాలని బజరంగ్ దళ్ కార్యకర్తలకు పిలుపునిచ్చాడు. ఫిబ్రవరిలో భివండీలో జరిగిన ఇద్దరు ముస్లిం వ్యక్తుల హత్య కేసులో నిందితుడైన మోను, ర్యాలీ రోజున తాను కూడా మేవత్‌లో ఉంటానని తెలిపాడు. అలాగే దమ్ముంటే ఈ ర్యాలీని అడ్డుకోవాలని సవాల్ చేశాడు. మరో వర్గాన్ని రెచ్చగొట్టేలా ఆ వీడియోలో మాట్లాడాడు. ఈ నేపథ్యంలో వీహెచ్‌పీ ర్యాలీపై రాళ్లు రువ్విన ఆ వర్గం యువకులు దానిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా చెలరేగిన హింసకు సంబంధించిన వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.