Kolkata Doctor Case: కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల పీజీ ట్రైనీ మహిళా డాక్టర్‌పై దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ని సీబీఐ గత రెంమూడు రోజులుగా విచారిస్తోంది. విచారణ కోసం ఈ రోజు కూడా సీబీఐ అతనికి సమన్లు పంపింది.
ఘటన జరిగినప్పటి నుంచి సందీప్ ఘోష్ ఈ కేసులో కీలకంగా మారారు. ఘటన జరిగిన వెంటనే అతను రాజీనామా చేయడం, ఆ తర్వాత మరో కాలేజీలో ఇదే స్థాయిలో ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈ నియామకాన్ని హైకోర్టు తప్పుపట్టింది. విద్యార్థులకు రక్షణ ఉండాల్సిన ప్రిన్సిపాల్ ఇలా రాజీనామా చేయడం ఏంటని, వెంటనే ప్రభుత్వం వేరే కాలేజీలో పోస్టింగ్ ఇవ్వడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తి చేసింది. వెంటనే అతడిని పదవి నుంచి తొలగించి, సెలవుల్లో పంపాలని మమతా సర్కారుని కోర్టు ఆదేశించింది.
Read Also: Siddaramaiah: ముడా స్కామ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు రిలీఫ్
ఇదిలా ఉంటే గత మూడు రోజలుగా సందీప్ ఘోష్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఇందులో కొన్ని..
* ఈ మరణాన్ని ఆత్మహత్యగా ఎందుకు అంత తొందరగా ప్రకటించాల్సి వచ్చింది..?
*మీరు ఓ డాక్టర్, నేర స్థలాన్ని సురక్షితంగా ఉంచడం ప్రాముఖ్యత మీకు తెలియదా..?
* ఎవరి సలహా మేరకు బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అందులో వాస్తవాలను ఎందుకు చెప్పలేదు..?
* నేరం జరిగిన ప్రదేశంలో సాక్ష్యాలను తారుమారు చేయడం నేరమని మీకు బాగా తెలుసు. అయినప్పటికీ విచారణ పూర్తయ్యే వరకు ఎందుకు భద్రంగా ఉంచలేదు..?
* ఘటన జరిగిన చాలా గంటల తర్వాత డాక్టర్ కుటుంబానికి ఎందుకు సమాచారం అందించారు..?
* డాక్టర్ మృతదేహాన్ని తల్లిదండ్రులకు చూపించడంలో ఎందుకు జాప్యం చేశారు..?
* ఆస్పత్రిలో ఎలాంటి భద్రతా చర్యలు ఉన్నాయి..?
* ఘటన జరిగిన వెనువెంటనే ఎందుకు రాజీనామా చేశారు..? దానికి వెనక కారణం ఏమిటి..?
సీబీఐ అడిగిన ఈ ప్రశ్నలకు ప్రిన్సిపాల్ సరైన సమాధానాలు చెప్పలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇదే కాకుండా ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత రాజీనామా చేసి సందీప్ ఘోష్, మృతదేహం దొరికిన సెమినార్ హాలు గదికి సమీపంలో ఆకస్మికంగా పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. దీనిపై కూడా సీబీఐ ప్రశ్నించింది. అతడి కాల్ హిస్టరీ, చాట్‌లను సీబీఐ పరిశీలిస్తోంది. ఆగస్టు 9న ఘటనకు ముందు, తర్వాత అతడి ఫోన్ కాల్స్ వివరాలను కోరింది. సర్వీస్ ప్రొవైడర్ నుంచి అతడి కాల్, డేటా యూసేజ్ వివరాలను రాబట్టాలని యోచిస్తోంది.
