మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి శనివారానికి ఏడు రోజులైంది. మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీ అయితే ఏకంగా 132 సీట్లు సాధించింది. ప్రజలంతా ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. అయినా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటు చేయలేకపోయారు. ఇంకోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం కాలం కూడా ముగిసింది. ఈపాటికే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. కానీ నాన్చుడి కొనసాగుతోంది. ఇంకోవైపు బీజేపీ హైకమాండ్ పెద్దల దగ్గర మహాయుతి పంచాయితీ కూడా జరిగింది. అయినా ఎటు తేల్చలేకపోయారు? అసలెందుకు? ఇంత ఆలస్యం చేస్తున్నారు? అసలేం జరుగుతుందో తెలియాలంటే ఈ వార్త చదవండి.
మహారాష్ట్రలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీ కలిసి మహాయుతి కూటమిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎన్నికల పోరులోకి దిగి భారీ విజయాన్ని అందుకున్నారు. అయితే ఫలితాల్లో మాత్రం బీజేపీ 132 సీట్లు, శివసేన 57, ఎన్సీపీ 41 సీట్లు సాధించాయి. మహా వికాస్ అఘాడీ మాత్రం ఘోరంగా వైఫల్యం చెందింది. ప్రజలంతా మహాయుతి కూటమికి ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. దీనికి ప్రధాన కారణంగా బీజేపీకి 132 సీట్లు రావడంతో ముఖ్యమంత్రి పోస్టును ఆశిస్తోంది. అయితే బీహార్ ఫార్ములా ప్రకారం షిండేకు సీఎం పోస్టు ఇవ్వాలంటూ శివసేన పట్టుబడుతోంది. ఇలా రెండు పార్టీల మధ్య అంతర్గత కుమ్ములాటలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మహాయుతి అగ్ర నేతలు దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌ను బీజేపీ హైకమాండ్ పెద్దలు ఢిల్లీకి పిలిపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అధ్యక్షుడు జేపీ నడ్డా ఒక్కొక్కరితో భేటీ అయి చర్చించారు. అయితే షిండే.. బీజేపీ ముఖ్యమంత్రిగా ఉంటే పదవులకు దూరంగా ఉంటామని చెప్పినట్లు తెలుస్తోంది. బీజేపీ ప్రభుత్వానికి తాము అడ్డుగా ఉండబోమని తేల్చి చెప్పినట్లు సమాచారం. ప్రధాని మోడీ, అమిత్ షా నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ బీహార్ ఫార్ములా ప్రకారం నిర్ణయం తీసుకుంటే శివసేనకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టాలని షిండే డిమాండ్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా తన కుమారుడు శ్రీకాంత్ షిండే భవిష్యత్ కూడా పరిష్కరించాలని కోరినట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి.
ఢిల్లీ పర్యటన ముగించుకుని ముంబై వచ్చిన ఏక్‌నాథ్ షిండే.. నేరుగా సొంతూరుకి వెళ్లిపోయారు. అయితే షిండేను బీజేపీ పక్కనపెట్టిందని శివసేన ఆరోపించింది. మరోవైపు తాజా పరిణామాలతో షిండే అనారోగ్యానికి కూడా గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ కూడా ముందడుగు వేయలేకపోతోంది. దీనికి కూడా బలమైన కారణాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
మహారాష్ట్రలో మరాఠా కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. మరాఠా వర్గంలో షిండే కీలక నేతగా ఉన్నారు. షిండేతో పాటు శివసేనలో మరికొంత మంది కీలక నేతలు ఉన్నట్లుగా బీజేపీ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఒకవేళ దేవేంద్ర ఫడ్నవిస్‌కు సీఎం పదవి కట్టబెడితే.. మరాఠాలు దూరమవుతారేమోనని కమలనాథులు భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలు తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. ఈ సస్పెన్ష్ ఇంకెంత కాలం కొనసాగిస్తారో చూడాలి.