Bombay High Court: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టాలపై బాంబే హైకోర్టు సీరియస్ అయింది. చట్టాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా లేవని వ్యాఖ్యానించింది. కొత్త చట్టాలు అతిగా ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో నకిలీ, తప్పుడు సమాచార వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల సవరించిన ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) నిబంధనలపై బాంబే హైకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. కొత్త నియమాలు మరీ విపరీతంగా ఉన్నాయంటూ.. ఒక చీమను చంపేందుకు సుత్తిని వాడలేం కదా? అని వ్యాఖ్యానించింది. కేంద్రం ఐటీ నిబంధనలకు చేసిన సవరణలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Read also: Asian Games 2023: భారత క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్.. ఎవరూ ఊహించరు! టీ20 టీమ్ ఇదే
ఆన్‌లైన్ కంటెంటులో నకిలీ, తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకుగాను ఫ్యాక్ట్‌చెక్ యూనిట్‌ను తీసుకువస్తామని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో పేర్కొంది. ఆ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్-2021కు ఇటీవల సవరణలు చేసింది. ఈ కొత్త నిబంధనలు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఐటీ నిబంధనల చెల్లుబాటును సవాలు చేస్తూ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాతోపాటు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మ్యాగజీన్స్.. బాంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. పౌరుల ప్రాథమిక హక్కులపై ఈ సవరణలు ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై బాంబే హైకోర్టులోని జస్టిస్ గౌతం పటేల్, జస్టిస్ నీలా గోఖలేలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరుపుతోంది. సోషల్ మీడియాలో నకిలీ సమాచారాన్ని కట్టడి చేసేందుకు తేలికైన మార్గాలు కూడా ఉన్నాయంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. ‘‘ఆఫ్‌లైన్ కంటెంటులో కొంత వడబోత ఉంది. సామాజిక మాధ్యమాల్లో ఇది లేదు. ఫ్యాక్ట్‌చెకింగ్ ఉండాలి. కొంతస్థాయి వరకు సోషల్ మీడియా కంటెంటును ఫ్యాక్ట్‌చెక్ చేయాలి. అయితే, ఈ నిబంధనలు మితిమీరినవని మీరు చెప్పిన మాట సరైనది కావచ్చు. ఐటీ నిబంధనలకు సవరణలు చేయాల్సిన అవసరం ఏమిటో ఇప్పటికీ అర్థం కాలేదని.. ఇవి లేకున్నా.. సామాజిక మాధ్యమాల పరిశీలనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఉంది కదా?’’ అని కోర్టు పేర్కొంది. నకిలీ, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని నిర్ణయించేందుకు ప్రభుత్వంలోని ఒక సంస్థకు పూర్తిస్థాయి అధికారాలను కట్టబెట్టడం కష్టం. ఈ పనిని కోర్టులే సక్రమంగా చేయగలవు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంది. దానికి సమాధానం ఇవ్వడం ప్రభుత్వ విధని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఫ్యాక్ట్‌చెక్ యూనిట్ ద్వారా నకిలీ, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ఎలా నిర్ణయిస్తారనే దానిపై స్పష్టత లేదని.. దీనికున్న హద్దులేమిటని ప్రశ్నించింది. కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌ను రెండుసార్లు చదివినప్పటికీ సమాధానం దొరకలేదని జస్టిస్ పటేల్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన తదుపరి విచారణను ధర్మాసనం జులై 27కు వాయిదా వేసింది.
