NTV Telugu Site icon

Delimitation: తొలి ‘‘డీలిమిటేషన్’’ సమావేశంలో 7-పాయింట్ల తీర్మానం.. అవి ఏంటంటే..

Delimitation

Delimitation

Delimitation: జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)ని దక్షిణాది రాష్ట్రాల నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలో సీఎం స్టాలిన్ అధ్యక్షతన శనివారం మొదటి డీలిమిటేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ, కేరళ, పంజాబ్ సీఎంలు రేవంత్ రెడ్డి, పినరయి విజయన్, భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో సహా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలు పార్టీల నేతలు హాజరయ్యారు.

తొలి జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) సమావేశంలో నేతలంతా ఏకగ్రీవంగా 7-పాయింట్ల తీర్మానాన్ని ఆమోదించారు. డీలిమిటేషన్ ఎక్సర్‌సైజ్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయపార్టీలు, సంబంధిత వాటాదారులతో ఖచ్చితమైన సంప్రదింపుల తర్వాతే ఉండాలని జేఏసీ నొక్కి చెప్పింది.

7- పాయింట్లు ఇవే:

* ప్రజాస్వా్మ్యం స్వభావాన్ని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఏదైనా లిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించబడాలి, అన్ని రాష్ట్రాల రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర వాటాదారులతో సంప్రదింపులు జరగాలి.

* 42, 84,87వ రాజ్యాంగ సవరణల ఉద్దేశం జనాభా నియంత్రణ చర్యల్ని సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలను రక్షించడం/ప్రోత్సహించడం. జనాభా స్థిరీకరణ లక్ష్యం ఇంకా సాధించబడినందున, 1971 జనాభా లెక్కల ఆధారంగా మరో 25 ఏళ్లు నియోజకవర్గాల సంఖ్యను స్తంభింపచేయాలి.

* జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసిన , తత్ఫలితంగా జనాభా వాటా తగ్గిన రాష్ట్రాలను శిక్షించకూడదు. ఈ ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైన రాజ్యాంగ సవరణలను అమలు చేయాలి.

* పైన పేర్కొన్న సూత్రాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైనా డీలిమిటేషన్ కసరత్తును చేపట్టడానికి చేసే ప్రయత్నాలను ఎదుర్కోవడానికి, జేఏసీలో భాగస్వామ్యంగా ఉన్న రాష్ట్రాల పార్లమెంటు సభ్యులతో కూడిన కోర్ కమిటీ పార్లమెంటరీ వ్యూహాలను సమన్వయం చేస్తుంది.

* ఎంపీల కోర్ కమిటీ పార్లమెంటరీ సమావేశంలో గౌరవనీయులైన భారత ప్రధానికి పైన పేర్కొన్న విధంగా ఉమ్మడి ప్రాతినిధ్యాన్ని సమర్పిస్తుంది.

* సమావేశంలో ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ రాష్ట్రాల రాజకీయ పార్టీలు ఈ అంశంపై తమ తమ రాష్ట్రాల్లో తగిన శాసనసభ తీర్మానాలను తీసుకురావడానికి ప్రయత్నాలను ప్రారంభిస్తాయ. వీటిని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తాయి.

* సమన్వయంతో కూడిన ప్రజాభిప్రాయం సేకరణ వ్యూహం ద్వారా గత డీలిమిటేషన్ కసరత్తుల హిస్టరీ, సందర్భం, ప్రతిపాదిత డీలిమిటేషన్ పరిణామాలపై సమాచారాన్ని ఆయా రాష్ట్రాల పౌరులకు తెలియజేసేందుకు జేఏసీ అవసరమైన ప్రయత్నాలు చేస్తుంది.