Site icon NTV Telugu

Gangster Goldy Brar: “సిద్ధూ మూసే వాలా” హత్యకు కారణాలు వెల్లడించిన గ్యాంగ్‌స్టర్..

Sidhu Moose Wala Goldy Brar

Sidhu Moose Wala Goldy Brar

Gangster Goldy Brar: ఫేమస్ పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలాను రెండేళ్ల క్రితం గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ముఠా హతమార్చింది. 2022 మేలో పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోని సొంతూరులో తన ఎస్‌యూవీ కారులో ప్రయాణిస్తున్న సమయంలో, అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. దీంతో మూసే వాలా అక్కడిక్కడే మరణించాడు. ఆయన ప్రయానిస్తున్న కారుపైకి 100 కన్నా ఎక్కువ బుల్లెట్లు ఫైర్ చేశారు.

హత్య జరిగిన రెండేళ్ల తర్వాత తొలిసారిగా ఈ హత్య గురించి గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ మాట్లాడారు. గోల్డీ బ్రార్ అసలు పేరు సతీందర్ జిత్ సింగ్. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. ‘‘తన అహంకారంతో అతను [మూస్ వాలా] క్షమించలేని కొన్ని తప్పులు చేసాడు’’ అని బ్రార్ చెప్పాడు. ‘‘అతడిని చంపడం తప్ప మాకు వేరే మార్గం లేదు. అతను తన చర్యలకు పరిణామాలు చెల్లించుకోవాల్సి వచ్చింది’’

పంజాబ్ లోని శ్రీ ముక్త్‌సర్ సాహిబ్‌కు చెందిన గోల్డీ బ్రార్, జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు సన్నిహితుడు. ఇతను కెనడా నుంచి తన ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాడు. బ్రార్‌ని చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద అధికారికంగా భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇంటర్‌పోల్ ఇతడిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఇతడు డ్రోన్ల ద్వారా భారత్ పాక్ సరిహద్దుల్లోకి ఆయుధాలు అక్రమ రవాణా చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ తన నోటీసుల్లో పేర్కొంది. నిషేధిత ఖలిస్తానీ ఉగ్రసంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషన్‌తో బ్రార్‌కి సంబంధాలు ఉన్నట్లు పేర్కొంది.

Read Also: Ring Road Murder: “బెంగళూర్ రింగ్ రోడ్ మర్డర్”.. సోనమ్ లాగే భర్తని చంపిన మరో భార్య కథ ఇది..

సిద్ధూ మూసే వాలా హత్య గురించి బ్రార్ మాట్లాడుతూ.. ‘‘లారెన్స్ బిష్ణోయ్‌తో సిద్ధూ మూసే వాలా టచ్‌లో ఉన్నాడు. వీరిద్దరి ఎలా పరిచమయ్యారో తెలియదు. నేను ఎప్పుడు అడగలేదు. లారెన్స్‌ని పొడిగే ప్రయత్నంలో తరుచుగా మూసే వాలా గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ మెసేజులు పంపించే వాడు’’ అని చెప్పాడు. పంజాబ్‌లో జరిగిన కబడ్డీ టోర్నమెంట్‌ విషయంలో ఉద్రిక్తత ప్రారంభమైనట్లు బ్రార్ వెల్లడించారు.

‘‘సిద్ధూ మూసే వాలా తమ ప్రత్యర్థుల్ని ప్రోత్సహించాడు. అప్పుడే మూసేవాలా వల్ల లారెన్స్ బిష్ణోయ్ కలత చెందాడు. అప్పుడే సిద్ధూని హెచ్చరించి, విడిచిపెట్టబోమని చెప్పాము. బిష్ణోయ్ సహచరుడు, మధ్యవర్తి విక్కీ మిద్దుఖేరా జోక్యంతో ఉద్రిక్తతలు చల్లారాయి. అయితే ఆగస్టు 2021లో మొహాలీలో మిద్దుఖేరాని కాల్చి చంపారు. సిద్ధూ గురించి అందరికి తెలుసు, పోలీసులు, మీడియాకు తెలుసు. అతను రాజకీయ నాయకులతో, అధికారంలో ఉన్న వ్యక్తులతో కలిసిపోయాడు. రాజకీయ శక్తి, డబ్బును ఉపయోగించి మా ప్రత్యర్థులకు సాయం చేశాడు. అతను చేస్తున్న పనికి శిక్షించాలని అనుకున్నాము. అతడు చేస్తున్న పనులకు పోలీసులు అతడిని అరెస్ట్ చేయాలని కోరాము, ఎవరూ మమ్మల్ని పట్టించుకోలేదు. మర్యాదగా చెబితే వినకుంటే, తుపాకీ గుండు శబ్ధమే వినిపిస్తుంది’’ అని బ్రార్ చెప్పినట్లు బీబీసీ నివేదించింది. శక్తివంతులు మాత్రమే న్యాయం పొందగలరు, మనలాంతటి సాధారణ ప్రజలు కాదని, నా సోదరుడికి నేను చేయాల్సింది చేశాను, నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని బ్రార్ అన్నారు.

Exit mobile version