NTV Telugu Site icon

Bihar: బీహార్‌లో విషాదం.. ఆలయం గోడ కూలి ఇద్దరు చిన్నారుల మృతి

Bihar

Bihar

బీహార్‌లో విషాదం చోటుచేసుకుంది. సరన్‌లో ఆలయం గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతిచెందగా.. ఒకరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగించారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.

బీహార్‌లోని సరన్ జిల్లాలో ఉన్న కథియా బాబా ఆలయ సరిహద్దు గోడ గురువారం కూలిపోయింది. గోడ సమీపంలో వరద నీటిలో స్నానం చేస్తున్న ముగ్గురు పిల్లలపై పడింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. ఒకరు గాయపడ్డారు. జేసీబీతో శిథిలాల తొలగింపునకు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

గాయపడ్డ చిన్నారి ఛప్రాలోని సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. శాంతిభద్రతల పరిరక్షణకు బలగాలను నియమించారు. ఘటనా స్థలంలో ఉన్నతాధికారులు మకాం వేశారు. శాంతిభద్రతల పరిస్థితి సాధారణంగా ఉందని సరన్ పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే చిన్నారుల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.

 

Show comments