అయోధ్యలోని రామమందిరానికి రక్షణ గోడ నిర్మించాలని భద్రతా నిపుణులు సూచించారు. దీంతో త్వరలో 4 కిలోమీటర్ల గోడతో కోట లాంటి భద్రత కల్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం రూ. 80–90 కోట్ల రూపాయలు కేటాయింపు జరిగింది. ఈ ప్రాజెక్టు రాబోయే 15 రోజుల్లో ప్రారంభమవుతుందని.. పూర్తి కావడానికి ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం పడుతుందని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Kashmiri Nurse Murder: కాశ్మీరీ నర్సు హత్య కేసులో ట్విస్ట్.. 35 ఏళ్ల తర్వాత కీలక దర్యాప్తు
ఆలయ సముదాయంలోని ఉత్తరం వైపు నుంచి నిర్మాణం ప్రారంభమై మొత్తం చుట్టు కవర్ అయ్యే వరకు దశలవారీగా పనులు కొనసాగనున్నాయి. మతపరమైన ప్రదేశానికి రక్షణ వ్యవస్థ ముఖ్యమైన భాగం అని భద్రతా నిపుణులు పేర్కొన్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ నిర్మాణం చేపడుతోంది. 14–16 అడుగుల ఎత్తులో మూడు అడుగుల ఉక్కు కంచెతో ఈ గోడ నిర్మాణం జరుగుతుంది. అనధికార ప్రవేశాన్ని నిరోధించడానికి అధునాతన నిఘా పరికరాలు, వాచ్‌టవర్‌లు ఏర్పాటు చేయనున్నారు. దీని నిర్మాణ బాధ్యతను ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్‌కు అప్పగించింది. ఈ గోడ నిర్మాణంతో ఆలయ భద్రతతో పాటు ఆధ్మాత్మిక పవిత్రతను కూడా బలోపేతం చేస్తుందని ట్రస్ట్ సీనియర్ సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు. ముళ్ల తీగలు, ఎలక్ట్రానిక్ సెన్సార్లు, వాచ్‌టవర్‌లతో సహా ఆధునిక నిఘా పరికరాలు ఉంటాయని చెప్పారు. అనధికార చొరబాటుకు ఎటువంటి అవకాశం ఇవ్వబోమని తెలిపారు. ఏప్రిల్ మధ్యలో ట్రస్ట్‌కు అందిన భద్రతా హెచ్చరిక నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: US: మోడీ మంచి నిర్ణయం తీసుకున్నారు.. అమెరికాకు గుణపాఠం నేర్పారన్న పెంటగాన్ మాజీ అధికారి
ప్రస్తుతం ఆలయ సముదాయాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సిబ్బంది కాపలాగా ఉంటున్నారు. మెటల్ డిటెక్టర్లు, స్కానర్లు ఉన్నాయి. గేట్ల ద్వారా ప్రవేశాన్ని కల్పిస్తున్నారు. తాజాగా కొత్త గోడ నిర్మాణం జరిగితే మరింత భద్రతా ఉండనుంది. ట్రస్ట్ నిర్ణయాన్ని భక్తులు, స్థానికులు మద్దతు ఇచ్చారు. ఆలయం రక్షణ కోసం గోడ నిర్మించడం గొప్ప పరిణామం అని భక్తురాలు తెలిపింది.
