NTV Telugu Site icon

Telugu population In USA: అమెరికా గడ్డ తెలుగోడి అడ్డా.. 8 ఏళ్లలో 4 రెట్లు పెరుగుదల..

Usa

Usa

Telugu population: ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది చదువు, ఉద్యోగాల కోసం విదేశాల బాట పడుతున్నారు. ముఖ్యంగా అమెరికానే తమ గమ్యస్థానంగా చాలా మంది ఎంచుకుంటున్నారు. తమ కొడుకు, కూతురు అమెరికాలో ఉంటున్నారని గర్వంగా చెప్పుకుంటున్నారు వారి తల్లిదండ్రులు. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే మనవాళ్లే ఎక్కువగా యూఎస్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. గణాంకాలను పరిశీలిస్తే 2016లో 3,20,000 మంది ఉండే తెలుగువారి సంఖ్య 2024 నాటికి 1.23 మిలియన్లకు పెరిగింది.

యూఎస్ అత్యధికంగా మాట్లాడే విదేశీ భాషల్లో తెలుగు 11వ స్థానంలో ఉంది. అత్యధికంగా మాట్లాడే భారతీయ భాషగా 3వ స్థానంలో ఉంది. తొలి రెండు స్థానాల్లో హిందీ, గుజరాతీ ఉన్నాయి. US సెన్సస్ బ్యూరో డేటా ఆధారంగా US యొక్క స్టాటిస్టికల్ అట్లాస్ నుండి వచ్చిన నివేదిక ప్రకారం, ఈ పెరుగుదలో నాలుగో తరం వలసదారులు, ఇటీవల కాలంలో వచ్చిన విద్యార్థులు కూడా ఉన్నారు. తెలుగు మాట్లాడేవారిలో దాదాపుగా 2 లక్షల మంది నివాసితులు కాలిఫోర్నియాలో ఉంటున్నారు. 1,50,000 మందితో టెక్సాస్‌లో ఉండగా, 1.10 లక్షల మంది న్యూజెర్సీలో ఉన్నారు. ఈ తర్వాతి స్థానాల్లో ఇల్లినాయిస్‌లో 83,000 మంది, వర్జీనియాలో 78,000 మంది, జార్జియాలో 52,000 మంది తెలుగువారు ఉన్నారు.

Read Also: Ponguleti: గత ప్రభుత్వం పద్మశ్రీ రామచంద్రయ్యకు ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి..

2010 నుంచి 2017 మధ్యకాలంలో అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 86% పెరిగిందని 2017లో అధ్యయనం చేసిన అమెరికన్ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ వెల్లడించింది. అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భాష తెలుగు అని తెలిపింది. 2010లో అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 4 లక్షల మందికి పైగా ఉందంటే, ప్రస్తుతం ఆ దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.

ప్రతీ ఏడాది తెలుగు మాట్లాడే ప్రాంతాల నుండి 60,000 నుండి 70,000 మంది విద్యార్థులు అమెరికా వెళ్తున్నారు. దాదాపుగా 10,000 మంది తెలుగు మాట్లాడేవారు H-1B వీసా కిందకు వస్తున్నారు. ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ మాజీ సెక్రటరీ అశోక్ కొల్లా ప్రకారం, కొత్తవారిలో 80 శాతం మంది తమ సంస్థలో నమోదు చేసుకున్నారని, దాదాపుగా 75 శాతం మంది డల్లాస్, బే ఏరియా, నార్త్ కరోలినా, న్యూ జెర్సీ, అట్లాంటా, ఫ్లోరిడా, నాష్విల్లే వంటి నగరాల్లో స్థిరపడుతున్నారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు 12.5 శాతం ఉన్నారు. కెంట్ స్టేట్ యూనివర్సిటీల్లో కొత్త విద్యార్థులకు స్వాగతం చెబుతూ తెలుగులో శుభాకాంక్షలు చెబుతుందంటే మన వారి డామినేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.