Site icon NTV Telugu

INDIA Bloc: కూటమిలో విభేదాలు.. ఢిల్లీ నుంచి పాట్నాకు తిరుగు ప్రయాణం.. రాఘోపూర్‌లో తేజస్వి యాదవ్ నామినేషన్

India Bloc

India Bloc

బీహార్‌ ఎన్నికలకు సమయం చాలా తక్కువగా ఉంది. ఇంకోవైపు అధికార ఎన్డీఏ కూటమి దూసుకుపోతోంది. కానీ ప్రతిపక్ష ఇండియా కూటమి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా వ్యవహారం కనిపిస్తోంది. తాజా పరిణామాలను చూస్తుంటే ఇండియా కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరినట్లుగా అర్థమవుతోంది. ఢిల్లీ నుంచి హుటాహుటినా తేజస్వి యాదవ్ పాట్నాకు చేరుకున్నారు. వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి రాఘోపూర్‌లో నామినేషన్ వేశారు.

ఇది కూడా చదవండి: Trump: పుతిన్ యుద్ధాన్ని ఎందుకు సాగదీస్తున్నారో అర్థం కావడం లేదు.. మీడియా ముందు ట్రంప్ ఆవేదన

సీట్ల పంపకాలపై చర్చించేందుకు తేజస్వి యాదవ్ సోమవారం ఢిల్లీ వెళ్లారు. కానీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేను, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని కలవకుండానే వెనుదిరిగారు. సీట్ల పంపకాల విషయంలోనే కాకుండా.. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలోనూ తేజస్వి యాదవ్‌ను కాంగ్రెస్ అంగీకరించడం లేదని తెలుస్తోంది. దీంతో తేజస్వి యాదవ్ కోపగించుకుని తిరిగి పాట్నాకు వచ్చేశారు. బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి రాఘోపూర్‌కు నామినేషన్ దాఖలు చేశారు.

ఇది కూడా చదవండి: Bihar Election 2025: జేడీయూ తొలి జాబితా విడుదల.. అనంత్ సింగ్‌తో సహా 57 మంది పేర్లు!

ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే కూటమి ముందుకు సాగదని తేజస్వి యాదవ్ సంకేతాలు ఇచ్చారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్‌కు చెప్పేసి వచ్చేసినట్లుగా వర్గాలు పేర్కొన్నాయి. తర్వాత స్పందిస్తానని చెప్పి పాట్నాకు వచ్చేసినట్లు సమాచారం. కాంగ్రెస్‌కు 61 సీట్లు ఇచ్చేందుకు ఆర్జేడీ ఆఫీర్ ఇచ్చింది. కానీ కొన్ని ఆర్జేడీ అంగీకరించడానికి ఇష్టపడని సీట్లు అడగడంతో విభేదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఇందులో కహల్‌గావ్, నర్కటియాగంజ్, చైన్పూర్, బచ్వారా స్థానాలు ఉన్నాయి. కహల్‌గావ్ అనేది కాంగ్రెస్‌కు కంచుకోట లాంటిది. 2015 వరకు కాంగ్రెస్ 9 సార్లు గెలుచుకుంది. ఇక నక్కటియాగంజ్‌లో ముస్లింలు ఎక్కువగా ఉంటారు. ఈ స్థానాన్ని కూడా కాంగ్రెస్ కోరుకుంటోంది. ఇలా కొన్ని సీట్ల పంపకాలపై తేడాలు రావడంతో రెండు పార్టీల మధ్య ఎటు తెగక కోపంతో తేజస్వి యాదవ్ తిరిగి వచ్చేశారు.

ఇది కూడా చదవండి: Supreme Court: ఢిల్లీ వాసులకు సుప్రీంకోర్టు శుభవార్త.. గ్రీన్ క్రాకర్ల వాడకానికి అనుమతి

నవంబర్ 6, 11 తేదీల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో సీట్ల పంకాలు జరిగిపోయాయి. అంతేకాకుండా తొలి జాబితాను విడుదల చేయడం.. నామినేషన్లు వేయడం కూడా మొదలైపోయాయి. అధికారంలోకి వద్దామనుకున్న ఇండియా కూటమిలో మాత్రం విభేదాలు తలెత్తి అయోమయంగా మారింది.

 

Exit mobile version