NTV Telugu Site icon

Tejashwi Yadav: ఇండియా కూటమి కేవలం లోక్‌సభ ఎన్నికల కోసమే.. దుమారం రేపుతున్న తేజస్వీ వ్యాఖ్యలు

Tejashwiyadav

Tejashwiyadav

2024 లోక్‌సభ ఎన్నికల కోసమే ఇండియా కూటమి ఏర్పడిందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేయడంపై మీడియా అడిగిన ప్రశ్నకు తేజస్వీ ఈ విధంగా స్పందించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ప్రధాన నినాదం అని, కేవలం ఆ నినాదానికే కూటమి పరిమితమైందని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆప్-కాంగ్రెస్ మధ్య విభేదాలు తలెత్తి వచ్చి ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఇది పెద్ద విషయమే కాదని వ్యాఖ్యానించారు. ఇక బీహార్‌లో కూడా అక్టోబర్ సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ కేవలం 70 సీట్లకే పరిమితం కాకుండా మొత్తం 243 సీట్లకు సిద్ధం కావాలని తేజస్వీ సూచించారు. దీంతో బీహార్‌లో కూడా పొత్తు ఉండదేమోనని సంకేతం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.

తేజస్వీ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. తేజస్వీ వ్యాఖ్యలను బట్టి.. ఇండియా కూటమి లేదన్న సంగతి అర్థమవుతుందని జేడీయూ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ తెలిపారు. బీహార్‌లో కూడా ఇండియా కూటమి అంతరించిపోయిందని సీఎల్పీ నాయకుడు షకీల్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు.

గత ఏడాది జూన్‌లో లోక్‌సభ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి భారత కూటమిలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జూన్ 4, 2024న లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత మోడీ మాట్లాడుతూ.. ఇండియా కూటమి విచ్ఛన్నం అవుతుందని జోష్యం చెప్పారు. మోడీ చెప్పినట్లుగానే నేటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్‌కు మిత్ర పక్షాలు సపోర్టు చేయలేదు. సింగిల్‌గానే లోక్‌సభలో పోరాటం చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో ఆప్-కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. దీంతో ఇండియా కూటమి విడిపోయినట్లుగానే కనిపిస్తోంది. ఇంకోవైపు ఇండియా కూటమి నాయకత్వ బాధ్యతలు మమతా బెనర్జీకి ఇచ్చేందుకు కాంగ్రెస్ సముఖంగా లేదు. ఇలా మొత్తంగా విభేదాలు తలెత్తాయి.

ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్-ఆప్ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఇక ఇప్పటికే ఆప్ అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ కొద్ది మంది పేర్లే వెల్లడించింది. ఇక బీజేపీ తొలి జాబితాలో 29 పేర్లు ప్రకటించింది.

Show comments