గుజరాత్ అల్లర్ల కేసులో జకియా జఫ్రీకి న్యాయసాయం అందించిన సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో మోదీకి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన జకియాకు సెతల్వాద్‌కు చెందిన ఎన్‌జీవో న్యాయసాయం అందించింది. అప్పటి గుజరాత్ అల్లర్లలో జకియా జాఫ్రీ భర్త, కాంగ్రెస్ ఎంపీ ఇషాన్ జఫ్రీ చనిపోయారు. అహ్మదాబాద్ సిటీ క్రైం బ్రాంచ్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా… ముంబయి శాంటాక్రూజ్‌లోని నివాసంలో సెతల్వాద్‌ను అదుపులోకి తీసుకున్నారు.
గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని మోదీకి సిట్ క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కొట్టివేసిన ఒకరోజు తర్వాత ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. గుజరాత్ అల్లర్ల కేసులో తీస్తా సెతల్వాడ్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ అధికారుల ఫిర్యాదు మేరకు సెతల్వాద్, సంజీవ్ భట్, శ్రీకుమార్‌లపై గుజరాత్ ఏటీఎస్ కేసులు నమోదు చేసింది. మరణ శిక్ష విధించడానికి అవకాశమున్న నేరంలో కొందరు వ్యక్తులను దోషులుగా ఇరికించడానికి సెతల్వాద్, సంజీవ్ భట్, శ్రీకుమార్ కుట్ర పూరితంగా తప్పుడు సాక్ష్యాలను పుట్టించి, న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేశారని క్రైం బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ డీబీ బారాద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
2002, ఫిబ్రవరి 28న అహ్మదాబాద్‌లోని గుల్‌బర్గ్ సొసైటీలో అల్లరి మూకలు జరిపిన దాడిలో కాంగ్రెస్ ఎంపీ ఇషాన్ జఫ్రీ సహా 68 మంది మరణించారు. దీనిపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేసుతో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ సహా మరికొంతమందికి ఎలాంటి సంబంధం లేదని సిట్ తేల్చింది. సిట్ క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ జకియా పలుకోర్టులను ఆశ్రయించారు. మార్చి 2008న సుప్రీంకోర్టు నియమించిన సిట్ జఫ్రీ ఆరోపణలపై విచారణ చేపట్టింది. 2010లో అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్న మోదీని సిట్ దాదాపు తొమ్మిది గంటలకు పైగా ప్రశ్నించింది. అనంతరం ఈ కేసులోని అన్ని ఆరోపణల నుంచి ప్రధాని మోదీని సిట్ తప్పించింది. ప్రధాని మోదీకి ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌తో కలిసి 2012 ఫిబ్రవరి 9న జఫ్రీ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు సిట్ ఉత్తర్వులను సమర్థించడంతో జఫ్రీ, సెతల్వాద్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. గుజరాత్ హైకోర్టులోనూ చుక్కెదురవడంతో సిట్ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ సుప్రీంను ఆశ్రయించగా.. శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం వారి పిటిషన్‌ను కొట్టివేసిన విషయం తెలిసిందే.