Teen Student Murdered By Girlfriend’s Ex: ప్రేమ వ్యవహారాలు హత్యలకు దారి తీస్తున్నాయి. బిజీ రోడ్డుపైనే ఓ అమ్మాయి మాజీ లవర్ మరో వ్యక్తిని హత్య చేశాడు. ఇది ముంబై మహానగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే గురువారం సాయంత్రం ముంబైలో బిజీగా ఉన్న ఓ రోడ్డులో ఇద్దరు వ్యక్తులు 19 ఏళ్ల కాలేజీ స్టూడెంట్ ను పొడిచి చంపారు. చనిపోయిన వ్యక్తిని చెంబూరు ప్రాంతానికి చెందిన ముఖ్తార్ షేక్ గా గుర్తించారు పోలీసులు.
గురువారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు ముఖ్తార్ ను కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. ప్రస్తుతం నిందితులిద్దరు పరారీలో ఉన్నారు. తీవ్రగాయాల పాలైన అతడిని సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతడు చనిపోయినట్లు ప్రకటించారు. బాధితుడు కాలేజ్ ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో హత్యకు గురయ్యాడు. ప్రేమ వ్యవహారంమే హత్యకు కారణం అని పోలీసులు చెబుతున్నారు.
ఓ అమ్మాయి ఇంతకుముందు నిందితుడిని ప్రేమించింది. అయితే సదరు అమ్మాయి అతడికి బ్రేకప్ చెప్పి ముఖ్తార్ షేక్ ను ప్రేమించడం ప్రారంభించిందని.. దీంతో అమ్మాయి మాజీ లవర్ అతని స్నేహితుడితో కలిసి ముఖ్తార్ షేక్ ను హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు పాల్పడిన నిందితుల్లో ఒకరిని పోలీసులు గుర్తించారు. హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. క్రైం బ్రాంచ్ తో పాటు ముంబై పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
