UDAN Yatri Cafe: విమానాశ్రయాల్లోకి వెళితే వాటర్ బాటిల్ దగ్గర నుంచి అల్పాహారం వరకు ధరలు మండిపోతుంటాయి. అయితే, వీటికి ఉపశమనం కల్పించేందుకు పౌర విమానయాన శాఖ కీలక చర్యలు తీసుకుంటోంది. కోల్‌కతాలోని సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన ప్రయాణికుల కోసం ‘‘ఉడాన్ యాత్రి కేఫ్’’ని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. అధిక ధరల్ని నిరోధించడానికి, విమాన యాత్రికులకు అందుబాటులో ధరలు ఉంచాలని లక్ష్యంగా ఈ పైలట్ ప్రాజెక్టుని ప్రారంభించారు.
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో ప్రారంభించబడిన ఈ కేఫ్‌లో బడ్జెట్‌కు అనుకూలంగా ఉంది. వాటర్ బాటిల్స్ రూ. 10, టీ రూ. 10, కాఫీ రూ. 20, సమోసా రూ. 20కి లభిస్తాయి. ప్రస్తుతం కోల్‌కతా ఎయిర్‌పోర్టులో పైలట్ ప్రాజెక్టు కింద ఈ ఉడాన్ యాత్రి కేఫ్ ప్రారంభించారు. క్రమక్రమంగా దేశంలోని అన్ని విమానాశ్రయాలకు దీనిని విస్తరించనున్నారు.
Read Also: Maheshwar Reddy: సీఎం రేవంత్ రెడ్డికి బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ..
“ఉడాన్ యాత్రి కేఫ్ కేవలం ఫుడ్ అవుట్‌లెట్ మాత్రమే కాదు, ఇది ప్రజల కోసం ప్రయాణ అనుభవాన్ని అందరికి అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం. సరసమైన ధరలకు కప్పు టీ, స్నాక్స్‌తో విమాన ప్రయాణాన్ని సుసంపన్నం చేయడం, అందరికీ అందుబాటులో ఉండేలా చేయడంలో మా నమ్మకాన్ని పునరుద్ఘాటిస్తున్నాము” అని మంత్రి చెప్పారు.
ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఇటీవల విమానాశ్రయాల్లో విపరీతమైన రేట్ల గురించి లేవనెత్తాన్నారు. ఆ తర్వాత కేంద్ర విమానయాన శాఖ నుంచి ఈ నిర్ణయం వచ్చింది. యాత్రి కేఫ్ ప్రారంభించడంపై చద్దా స్పందిస్తూ.. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విమానాశ్రయాల్లో ఆహార స్థోమత అంశాన్ని నేను హైలైట్ చేసిన తర్వాత కోల్‌కతా విమానాశ్రయంలో టీ ధరలు తగ్గించబడ్డాయి. ఇది మా ప్రజల విజయం, ఈ మార్పుకు ఉత్ప్రేరకం అయినందుకు నేను గర్వపడుతున్నానని అన్నారు. మరిన్ని విమానాశ్రయాల్లో ఈ సౌకర్యాన్ని తీసుకురావాలని ఆయన ఆశించారు.