2013 నాటి అత్యాచారం కేసులో దోషిగా తేలిన మాజీ తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లొంగిపోవడం నుంచి మినహాయింపు కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. రెండు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది.
తేజ్‌పాల్ పిటిషన్‌పై జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ సోమవారం విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్ చేసింది. తేజ్‌పాల్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, గోవా ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
తేజ్‌పాల్ అప్పీల్‌ను విచారణకు స్వీకరించాలంటే ముందుగా ఆయన లొంగిపోయినట్లు ధ్రువీకరించే సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని.. లేదంటే లొంగిపోవడం నుంచి మినహాయింపు కోరుతూ ప్రత్యేక పిటిషన్ దాఖలు చేయాలని తుషార్ మెహతా వాదించారు. సుప్రీంకోర్టు రూల్స్, 2013తో పాటు గత తీర్పులను ఆయన ప్రస్తావించారు.
అయితే కపిల్ సిబల్ మాత్రం గోవా ప్రభుత్వం ప్రస్తావించిన సుప్రీంకోర్టు నిబంధనలు ఈ కేసుకు వర్తించవని వాదించారు. బాంబే హైకోర్టు ఇప్పటికే తేజ్‌పాల్‌కు నాలుగు వారాల గడువు ఇచ్చిందని, అప్పటివరకు ఆయనకు కోర్టు రక్షణ ఉందని తెలిపారు. ఆగస్టు 31న రెగ్యులర్ బెంచ్ ముందు కేసును విచారణకు లిస్ట్ చేయాలని కోరారు.
ఆగస్టు 6న బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తేజ్‌పాల్ ఆగస్టు 20న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2021లో గోవా సెషన్స్ కోర్టు ఇచ్చిన నిర్దోషి తీర్పును బాంబే హైకోర్టు కొట్టివేసి.. తేజ్‌పాల్‌ను అత్యాచారం కేసులో దోషిగా తేల్చింది.
2013 నవంబర్‌లో గోవాలో తెహెల్కా నిర్వహించిన ఓ కార్యక్రమం సందర్భంగా హోటల్ లిఫ్ట్‌లో తనతో పనిచేసిన జూనియర్ మహిళా ఉద్యోగిపై తేజ్‌పాల్ రెండుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. అదే నెలలో ఆయనను అరెస్టు చేశారు. 2014 జూలైలో బెయిల్ లభించింది. 2017లో విచారణ ప్రారంభం కాగా.. 2021 మేలో గోవా సెషన్స్ కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పును గోవా ప్రభుత్వం బాంబే హైకోర్టులో సవాల్ చేసింది. 81 పేజీల తీర్పులో హైకోర్టు ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని “వక్రీకృతమైనది”గా అభివర్ణించింది. విచారణ సందర్భంగా ఫిర్యాదుదారురాలిని వ్యవహరించిన తీరుపై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. లైంగిక దాడికి గురైన మహిళ “పర్ఫెక్ట్ బాధితురాలు”లా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే భావనకు ట్రయల్ కోర్టు లోనైందని హైకోర్టు పేర్కొంది. ఆమె వ్యక్తిగత జీవితంపై డిఫెన్స్ చేసిన వాదనలపైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
తేజ్‌పాల్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష
బాంబే హైకోర్టు భారతీయ శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద తేజ్‌పాల్‌ను దోషిగా తేల్చింది. విశ్వాసం లేదా అధికార స్థితిని ఉపయోగించి అత్యాచారానికి పాల్పడినందుకు సంబంధించిన సెక్షన్ 376(2)(f)తో పాటు లైంగిక వేధింపులు, దుస్తులు విప్పే ఉద్దేశంతో దాడి లేదా క్రిమినల్ ఫోర్స్‌కు సంబంధించిన సెక్షన్లు 354(a), 354(b) కింద కూడా దోషిగా నిర్ధారించింది. ఆయనకు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 లక్షలకు పైగా జరిమానా విధించింది. తొలుత రెండు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించిన హైకోర్టు.. ఆయన న్యాయవాదుల అభ్యర్థన మేరకు ఆ గడువును నాలుగు వారాలకు పొడిగించింది. దీంతో సెప్టెంబర్ మొదటి వారంలో ఆయన లొంగిపోవాల్సి ఉంది. సెక్షన్ 376(2)(f) కింద గరిష్ఠంగా జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది.
తేజ్‌పాల్‌కు విధించిన శిక్షను జీవిత ఖైదుకు పెంచాలని కోరుతూ గోవా ప్రభుత్వం విడిగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ శిక్ష పరిమాణానికి మాత్రమే పరిమితమైంది. అలాగే శిక్షలను ఏకకాలంలో అమలు చేయాలని బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని కూడా ప్రభుత్వం సవాల్ చేసింది. అయితే సంఘటన జరిగి చాలా కాలం గడిచిపోవడం, ఆ తర్వాత ఎలాంటి నేరపూరిత ప్రవర్తనకు పాల్పడినట్లు ఆధారాలు లేకపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు జీవిత ఖైదు విధించేందుకు నిరాకరించింది.
శిక్ష ఖరారు చేసే సమయంలో తేజ్‌పాల్ తనకు క్షమాభిక్ష చూపాలని కోరుతూ.. తాను “రాజకీయ బాధితుడిని” అని పేర్కొన్నారు. తాను ఇద్దరు కుమార్తెలకు తండ్రినని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే గోవా ప్రభుత్వం తరఫున తుషార్ మెహతా గరిష్ఠ శిక్ష విధించాలని కోరుతూ.. “నో అంటే నో” అనే సందేశం బలంగా వెళ్లాల్సిన అవసరం ఉందని వాదించారు.

