Tamil Nadu: తమిళనాడులో బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) చీఫ్ కే ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య ఆ రాష్ట్రంలోనే కాదు దేశంలో సంచలనంగా మారింది. ముఖ్యంగా స్టాలిన్ ప్రభుత్వంపై విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. డీఎంకే ప్రభుత్వాన్ని విమర్శించాయి. స్టాలిన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఈ హత్య తర్వాత కూడా పలువురు బీజేపీ, ఏఐడీఎంకే పార్టీలకు చెందిన కార్యకర్తల హత్యలు చోటు చేసుకున్నాయి. ఇలా రాజకీయ హత్యలతో రాష్ట్రం అట్టుడికిపోయింది.
Read Also: Helicopter crash: నేపాల్‌లో హెలికాప్టర్ క్యాష్.. నలుగురు మృతి..
ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసులో ఇప్పటి వరకు 22 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూలై 5న చెన్నైలోని పెరంబూర్‌లో ఆర్మ్‌స్ట్రాంగ్‌ని ఆరుగురు వ్యక్తులు నరికి చంపారు. ఈ కేసులో తాజాగా మరో నిందితుడని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. విచారణలో మరో అరుల్ అనే నిందితుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అశ్వథామన్ పేరు వెల్లడించడంతో, ఇతడిని అరెస్ట్ చేశారు. అశ్వథామన్ అరెస్ట్ తర్వాత కాంగ్రెస్ అతడిని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
ప్రతీకారంతోనే ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య జరిగినట్లు పోలీసులు తేల్చారు. జూలై 5న అతడి నివాసంలో ఉండగా ఫుడ్ డెలివరీ వ్యక్తుల వేషంలో వచ్చిన ఆరుగురు అతడిని కత్తులతో నరికి చంపారు. నిందితుల్లో ఒకరైన తిరువేంగడంని జూలై 13న చెన్నైలోని మాధవరం సమీపంలో పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. హిస్టరీ షీటర్ అయిన తిరువేంగడం హత్య చేయడానికి ముందు చాలా రోజులుగా ఆర్మ్‌స్ట్రాంగ్‌పై రెక్కీ నిర్వహించాడు.