NTV Telugu Site icon

Chess Olympiad: ఆకట్టుకుంటోన్న చెస్‌ బోర్డు లాంటి బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా?

Chess Olympiad

Chess Olympiad

Chess Olympiad: 44వ ఫిడే చెస్ ఒలింపియాడ్ జూలై 28న చెన్నైలోని మహాబలిపురంలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా చెన్నై నగరంలోని నేపియర్‌ బ్రిడ్జ్‌కి చెస్‌ బోర్డులా పేయింట్‌ వేశారు. ఈ బ్రిడ్జ్‌ ప్రయాణికులను అత్యద్భుతంగా ఆకట్టుకుంటోంది. వందేళ్ల చెస్‌ ఒలింపియాడ్‌ చరిత్రలో తొలిసారిగా భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. చెస్ బోర్డులా పెయింట్ వేయబడిన ఈ వంతెన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ఈ వంతెనకు సంబంధించిన దృశ్యాలను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. కారులో వెళ్తూ రికార్డు చేసిన వీడియోను ట్విటర్‌లో పంచుకున్నారు. ఈ మేరకు ఐఏఎస్‌ అధికారిణి సుప్రియా సాహు ఈ బ్రిడ్జ్‌ తాలుకా వీడియోని పోస్ట్‌ చేస్తూ…భారతదేశానికి చెందిన చెస్‌ రాజధాని చెన్నై గగ్రాండ్‌ చెస్‌ ఒలింపియాడ్‌ 2022కి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, ఐకానిక్‌ నేపియర్‌ బ్రిడ్జ్‌గా చెస్‌ బోర్డులా అలంకరిచండబడిందని ట్వీట్‌ చేశారు. దీంతో నెటిజన్లు ‘వావ్‌ వాటే స్పీరిట్‌ నమ్మా చెన్నై’ అంటూ ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు. “యానిమేటెడ్ ప్రపంచంలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది,” అని మరొకరు కామెంట్ చేశారు. చెస్ ఒలింపియాడ్-2022 టీజర్‌ను రజనీకాంత్ విడుదల చేసిన ఒక రోజు తర్వాత ఈ వీడియో వచ్చింది. ఈ ఏడాది ఈ ఒలింపియాడ్‌ ఈవెంట్‌కి సుమారు 2 వేల మంది దాక క్రీడాకారులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ ఈవెంట్ ఆగస్టు 10న ముగుస్తుంది. దాదాపు 100 ఏళ్ల చెస్ ఒలింపియాడ్ చరిత్రలో తొలిసారిగా భారత్ ఆతిథ్యమివ్వనుంది. రాబోయే ఈవెంట్ కోసం మొత్తం 188 దేశాలు నమోదు చేసుకున్నాయి.

గత నెలలో 44వ చెస్ ఒలింపియాడ్ కోసం తొలిసారిగా టార్చ్ రిలేను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. “చెస్ ఒలింపియాడ్ మొట్టమొదటి టార్చ్ రిలే భారతదేశం నుండి ప్రారంభమవుతుందని, భారతదేశం పెద్ద ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడం కూడా ఇదే మొదటిసారి.” అని ప్రధాని తెలిపారు. ఈ క్రీడ తన జన్మస్థలం నుండి పురోగమించి ప్రపంచమంతటా తన ఉనికిని చాటుకున్నందుకు గర్విస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. చెస్ దాని జన్మస్థలానికి తిరిగి రావడం, చెస్ ఒలింపియాడ్ రూపంలో దాని విజయాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 44వ చెస్‌ ఒలింపియాడ్‌ టీజర్‌ను శుక్రవారం సాయంత్రం సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ పోటీలు రాష్ట్రంలో నిర్వహించడం తమిళులందరికీ గర్వకారణమని అన్నారు. సుమారు 30 సెకన్ల నిడివిగల ఆ టీజర్‌లో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ తెల్లటి ప్యాంటు చొక్కా ధరించి గంభీరంగా నడిచి వచ్చే దృశ్యాలు ఉన్నాయి. మహాబలిపురం సముద్రతీర ఆలయం వద్ద భరత నాట్య కళాకారిణులు నృత్యం చేస్తున్న దృశ్యాలు, నేపియర్‌ వంతెన చెస్‌ బోర్డు రంగులను పులుముకున్న దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. వీడియో చివరలో స్టాలిన్‌ నమస్కరిస్తుండగా.. తమిళనాడుకు రండి రండి అంటూ పాట ముగుస్తుంది. విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీత సారథ్యంలో ఈ టీజర్‌ రూపొందింది.