NTV Telugu Site icon

MK Stalin: ‘‘దక్షిణాదిపై కేంద్రం కత్తి’’.. డీలిమిటేషన్, హిందీపై స్టాలిన్ ఫైర్..

Mk Stalin

Mk Stalin

MK Stalin: తమిళనాడు ప్రభుత్వం, డీఎంకే పార్టీ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జాతీయ విద్యా విధానంలో(ఎన్‌‌ఈపీ) భాగంగా తమ రాష్ట్రంపై బలవంతంగా ‘‘హిందీ’’ని రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాకుండా వచ్చే ఏడాది పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్ కసరత్తు జరుగనుండటంతో తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ స్థానాల సంఖ్య తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, ఈ రెండు అంశాలు డీఎంకే, బీజేపీ మధ్య చిచ్చు పెట్టాయి. వీటితో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలోని యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్ల నియామకంపై ఘర్షణకు దారి తీసింది.

Read Also: Subramanian Swamy: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక.. హైకోర్టులో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి పిల్..

జనాభా ఆధారంగా చేపట్టే డీలిమిటేషన్ అంశంపై చర్చించడానికి మంగళవారం ఎంకే స్టాలిన్ అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఇది అన్నిరంగాల్లో ముందున్న, జనాభా నియంత్రణ సాధించిన తమ రాష్ట్రానికి దెబ్బగా పేర్కొన్నారు. పార్లమెంట్‌లో తమిళనాడు గొంతును నిలిపేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ సమస్య ‘‘దక్షిణాది రాష్ట్రాలపై కత్తి వేలాడుతుంది’’ అని అన్నారు. ఇది కేవలం సీట్ల సంఖ్య గురించి మాత్రమే కాదని, మన హక్కులు గురించి అని స్టాలిన్ అన్నారు.

డీలిమిటేషన్ కసరత్తులో తమిళనాడు జనాభా స్థాయిని నియంత్రించినప్పటికీ, కేవలం రెండు సీట్లు మాత్రమే పొందవచ్చు, అంటే ఇప్పుడున్న 39 లోక్‌సభ స్థానాలు 41కి పెరిగే అవకాశం ఉంది. స్టాలిన్ చెబుతున్న దాని ప్రకారం,ఈ సంఖ్య 8కి తగ్గే అవకాశం కూడా ఉంది. ఒక వేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, లోక్‌సభ సీట్ల సంఖ్య 543 నుంచి 750కి పెరుగుతుంది. ముఖ్యంగా బీజేపీకి గట్టి పట్టు ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా ఆధారంగా సీట్లు పెరిగే అవకాశం ఉందనేది ప్రతిపక్షాల వాదన, ఉత్తర్ ప్రదేశ్‌లో ఏకంగా 60 శాతం సీట్లు అంటే, ఇప్పుడున్న 80 సీట్లు, 126కి పెరిగే అవకాశం ఉంది.