తమిళంపై కేంద్రానికి ప్రేముంటే.. తమిళనాడులోని కేంద్ర కార్యాలయాల్లో హిందీ తొలగించాలని ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో డిమాండ్ చేశారు. డీలిమిటేషన్‌పై స్టాలిన్.. బుధవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆయా రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ భేటీలో కమల్‌హాసన్ కూడా పాల్గొన్నారు.
ప్రధాని మోడీకి తమిళం అంటే అపారమైన ప్రేమ అని బీజేపీ చెబుతోందని.. అదే నిజమైతే చేతల్లో ఎందుకు చూపించడం లేదని స్టాలిన్ ప్రశ్నించారు. పార్లమెంటులో సెంగోల్‌ను ఏర్పాటు చేయడం కంటే.. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి హిందీని తొలగిస్తే బాగుంటుందన్నారు. హిందీకి బదులుగా తమిళాన్ని అధికార భాషగా చేసి.. మరిన్ని నిధులు కేటాయించాలని స్టాలిన్ కోరారు.
ఇక లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో స్టాలిన్ మాట్లాడారు. 1971 జనాభాల లెక్కల ఆధారంగానే విభజన ప్రక్రియ చేపట్టాలని కేంద్రాన్ని స్టాలిన్ అభ్యర్థించారు. ప్రస్తుత జనాభా ప్రకారం.. పార్లమెంటులో తాము 12 సీట్లు కోల్పోయి.. 10 సీట్లు మాత్రమే వస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇది తమిళ రాజకీయాలపై ప్రత్యక్షంగా దాడి చేయడమేనన్నారు. ఈ చర్య రాష్ట్ర గొంతును నొక్కేస్తుందన్నారు. తాము విభజనకు వ్యతిరేకం కాదని స్టాలిన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా 2026 జనాభా లెక్కల ఆధారంగా విభజన ప్రక్రియ చేపట్టరాదని అఖిలపక్ష సమావేశం డిమాండ్ చేసింది.