Site icon NTV Telugu

World Idli Day: ఇడ్లీనా మజాకా.. గతేడాది 3.3 కోట్ల ప్లేట్ల ఇడ్లీల డెలివరీ..

Idli

Idli

World Idli Day: భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం. ప్రాంతాల వారీగా ప్రజలు ఆచారాలు, ఆహారపు అలవాట్లు, భాష, కట్టుబొట్టు మారుతుంటాయి. ముఖ్యంగా ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో వంటల్లో భిన్నత్వం కనిపిస్తుంటుంది. దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువగా బియ్యం ప్రధానంగా ఉంటే ఇడ్లీలు, దోశెలు, ఊతప్ప ఇలాంటి టిఫిన్స్ కు ప్రాధాన్యత ఇస్తుంటారు. ముఖ్యంగా అల్పహారంలో ఇడ్లీలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ ఏడాది మార్చి 30ని ‘‘అంతర్జాతీయ ఇడ్లీ దినోత్సవం’’గా జరుపుకుంటారు.

తాజాగా వరల్డ్ ఇడ్లీ డే సందర్భంగా ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ తన సర్వే వివరాలను వెల్లడించింది. స్విగ్గీ గత ఏడాది కాలంలో మొత్తం 3.3 కోట్ల ప్లేట్ల ఇడ్లీ ఆర్డర్లను డెలివరీ చేసిందని తెలిపింది. మార్చి 30, 2022 మరియు మార్చి 25, 2023 మధ్య ఇడ్లీల ఆర్డర్లను వెల్లడించింది. ఈ సంఖ్య చాలా ఇడ్లీకి ప్రజల్లో ఉన్న ఆదరణను తెలియజేస్తుంది. మరో విషయం ఏంటంటే.. హైదరాబాబ్ కు చెందిన ఓ కస్టమర్ ఏకంగా ఏడాది కాలంలో రూ.6 లక్షల విలువైన 8,428 ప్లేట్ల ఇడ్లీలను ఆర్డర్ చేశారని వెల్లడించింది. ఈ కస్టమర్ బెంగళూర్, చెన్నై నగరాలకు వెళ్లినప్పుడు స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం ఇడ్లీనే ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ తెలిపింది.

Read Also: IPL 2023: ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు చేసి బ్యాటర్లు వీరే..

ఇడ్లీని ఆర్డర్ చేస్తున్న నగరాల్లో బెంగళూర్, హైదరాబాద్, చెన్నై తొలిమూడు స్థానాల్లో ఉన్నాయి. ఆ తరువాత ఢిల్లీ, కోల్ కతా, కొచ్చి, ముంబై, కోయంబత్తూర్, పూణే, విశాఖపట్నం నగరాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉదయం 8 నుంచి 10 గంటల మధ్యలో ఇడ్లీల ఆర్డర్లు ఎక్కువగా ఉంటున్నట్లు స్విగ్గీ తెలిపింది.

సాదా ఇడ్లీని అన్ని నగరాల్లో ప్రాచుర్యం పొందింది. అయితే రవ్వ ఇడ్లీ ఇతర నగరాల కన్నా బెంగుళూర్ లో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. నెయ్యి కారం ఇడ్లీ తమిళనాడు, ఏపీ, తెలంగాణల్లో ప్రసిద్ది చెందింది. మసాలా దోశ తర్వాత స్విగ్గీలో అత్యధికంగా ఆర్డర్ అవుతున్న బ్రేక్ ఫాస్ట్ ఐటమ్స్ లో ఇడ్లీ రెండో స్థానంలో ఉంది. కస్టమర్లు ఇడ్లీలతో పాటు సాంబార్, కొబ్బరి చట్నీ, కారంపూరి, నెయ్యి, రెడ్ చట్నీ, జైన్ సాంబార్, టీ, కాఫీ వంటివకి కూడా ఆర్డర్ చేస్తున్నట్లు స్విగ్గీ వెల్లడించింది. బెంగళూర్, చెన్నైలోని ఏ2బీ అడయార్ ఆనంద భవన్, హైదరాబాద్ లోని వరలక్ష్మీ టిఫిన్స్, చెన్నైలోని సంగత వెజ్ రెస్టారెంట్, హైదరాబాద్ లోని ఉపహార్ ఇడ్లీలకు ప్రసిద్ధి చెందిన టాప్ 5 రెస్టారెంట్లుగా ఉన్నాయి.

Exit mobile version