Swati Maliwal Assualt: స్వాతి మలివాల్ అంశం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. రాజ్యసభ ఎంపీగా, ఆప్ కీలక నేతగా ఉన్న స్వాతి మలివాల్‌పై సోమవారం సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో దాడి జరిగింది. కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ తను దారుణంగా కొట్టినట్లు ఆమె ఆరోపించింది. దీనిపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ రోజు నిందితుడు బిభవ్ కుమార్‌ని అరెస్ట్ చేశారు. ఈ పరిణామా ఆప్, బీజేపీ మధ్య రాజకీయ అస్త్రంగా మారింది. ఇరు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ దాడిపై కేజ్రీవాల్ మౌనంగా ఉండటం పట్ల బీజేపీ ప్రశ్నిస్తోంది. బిభవ్ కుమార్‌కి మద్దతుగా కేజ్రీవాల్ వ్యహరిస్తున్నారంటూ ఆరోపించింది. ఇదిలా ఉంటే స్వాతి మలివాల్‌పై దాడి జరగలేదని, ఇదంతా బీజేపీ కుట్రగా ఆప్ ఆరోపిస్తోంది.
Read Also: RCB vs CSK: బెంగళూరు, చెన్నై కీలక మ్యాచ్.. చిన్నస్వామిలో వాతావరణ పరిస్థితి ఎలా ఉందంటే?
ఇదిలా ఉంటే తాజాగా ఎయిమ్స్ నివేదిక కీలక విషయాలను వెల్లడించింది. స్వాలి మలివాల్ ఎడమ కాలు తొడపై, చెంపపై గాయాలు ఉన్నట్లుగా రిపోర్టులో వెల్లడించింది. ఎఫ్ఐఆర్ నివేదిక ప్రకారం.. బిభవ్ కుమార్ తనను పూర్తి శక్తితో చెంపపై ఏడెనిమిది సార్లు కొట్టాడని, కడుపులో, ఛాతిపై తన్నాడని ఆమె పేర్కొంది. స్వాతి మలివాల్‌కి శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. మెడికో లీగల్ సర్టిఫికేట్ ప్రకారం.. స్వాతి మలివాల్ కాలిపై 3×2 సెం.మీ పరిమాణంలో, కుడి కన్ను క్రింద, కుడి చెంప దగ్గర 2×2 సెం.మీ పరిమాణంలో గాయాలు ఉన్నాయి అని వైద్య నివేదిక పేర్కొంది. ఇదిలా ఉంటే, ఈ కేసులో నిన్న ఢిల్లీ పోలీసులు, ఫోరెన్సిక్ టీం కేజ్రీవాల్ నివాసంలో సాక్ష్యాలు సేకరించేందుకు వెళ్లింది. స్వాలి మలివాల్‌ని తీసుకెళ్లి సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. ఈ కేసులో అత్యంత కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
