NTV Telugu Site icon

Swati Maliwal: ‘‘అఫ్జల్ గురు ఉరిశిక్షను ఆపడానికి పోరాడిన ఫ్యామిలీ మీది’’.. అతిషీపై స్వాతిమలివాల్ ఫైర్..

Swati Maliwal

Swati Maliwal

Swati Maliwal: ఢిల్లీకి కాబోతున్న కొత్త ముఖ్యమంత్రి అతిషీపై, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు రాజీనామా చేస్తున్న తరుణంలో కొత్త ముఖ్యమంత్రిగా ఆప్ ఎమ్మెల్యేలు అతిషీని ఎన్నుకున్నారు. అయితే, ఆమెపై అదే పార్టీకి చెందిన స్వాతి మలివాల్ విమర్శలు గుప్పించారు. పార్లమెంట్‌పై ఉగ్రదాడి నిందితుడు అఫ్జల్ గురుకి ఉరిశిక్షని నిలిపేయాలని పోరాడిన కుటుంబం అతిషీది అని ఆమె అన్నారు.

Read Also: Atishi: కేజ్రీవాల్‌ని మళ్లీ సీఎం చేయడమే మా లక్ష్యం.. సీఎంగా ఎన్నికైన అతిషీ తొలి కామెంట్స్..

‘‘ ఈ రోజు ఢిల్లీకి చాలా విచారకరమైన రోజు. ఉగ్రవాది అఫ్జల్ గురును ఉరితీయకుండా కాపాడేందుకు తన కుటుంబం సుదీర్ఘ పోరాటం చేసిన మహిళను ఢిల్లీ ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ఉగ్రవాది అఫ్జల్ గురును కాపాడాలంటూ ఆమె తల్లిదండ్రులు రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్లు రాశారు. వారి ప్రకారం, అఫ్జల్ గురు నిర్దోషి మరియు రాజకీయ కుట్రలో భాగంగా ఇరికించబడ్డాడు’’ అని స్వాతి మలివాల్ ఎక్స్ వేదికగా కామెంట్స్ చేశారు. అతిషీ ‘‘డమ్మీ సీఎం’’ ,ఈ సమస్య జాతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనలను లేవనెత్తుతుందిన మలివాల్ అన్నారు. ‘‘ ఈ సమస్య దేశ భద్రతకు సంబంధించినది. ఢిల్లీని దేవుడే కాపాడాలి!’’ అని ట్వీట్ చేశారు.

2001 పార్లమెంటు దాడిలో దోషిగా తేలిన అఫ్జల్ గురును 2013లో ఉరితీశారు. అఫ్జల్ గురు ఉరిని ఆపాలని రాష్ట్రపతికి అతిషి తల్లి త్రిప్తా వాహి రాసిన క్షమాపణ లేఖను మలివాల్ తన ట్వీట్‌లో జోడించారు. లేఖలో త్రిప్తా వాహి.. అఫ్జల్‌కి విధించిన శిక్షను రద్దు చేయాలని, అఫ్జల్ ఎపిసోడ్‌ని పార్లమెంటరీ విచారణ జరిపించాలని రాష్ట్రపతికి రాసిన లేఖలో ప్రస్తావించారు.

Show comments