NTV Telugu Site icon

Maharashtra CM Post: కోలుకోని షిండే.. ఎన్డీఏ సమావేశం రద్దు! అసలేం జరుగుతోంది

Maharashtra Cm Post

Maharashtra Cm Post

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక బీజేపీ అధిష్టానానికి కత్తిమీద సాములా తయారైంది. నవంబర్ 23న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చాయి. దాదాపు నేటికి 9 రోజులైంది. అయినా కూడా ఈనాటికి సీఎం అభ్యర్థిని ఎంపిక చేయలేకపోయారు. హైకమాండ్ పెద్దలు ఢిల్లీకి పిలిపించి చర్చలు జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి పేరును అధికారికంగా ప్రకటించేందుకు తీవ్ర హైరానా పడుతోంది. వాస్తవానికి బీజేపీ 132 సీట్లు సాధించి అగ్ర స్థానంలో ఉంది. కానీ మహాయుతి కూటమిలో భాగంగా బీజేపీ సీఎం అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించేందుకు మాత్రం జంకుతోంది. దీనికంతటికి కారణం.. ఏక్‌నాథ్ షిండే‌నే కారణంగా తెలుస్తోంది. మహారాష్ట్రలో మరాఠాలు అధికంగా ఉంటారు. పైగా శివసేనలో కూడా ఆ వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఒకవేళ మరాఠా వర్గానికి చెందిన వ్యక్తి కాకుండా.. మరొక వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. ఏం జరుగుతోందోనని భయాందోళన చెందుతోంది. ఇందుకోసం ముఖ్యమంత్రి పేరును అధికారికంగా ప్రకటించేందుకు మల్లగుల్లాలు పడుతోంది.

ఇదిలా ఉంటే ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌ కలిశారు. ముగ్గురితో విడివిడిగా సమావేశం నిర్వహించి చర్చలు జరిపారు. కానీ సమస్య మాత్రం కొలిక్కి రాలేదు. అనంతరం ఢిల్లీ నుంచి షిండే ముంబైకి రాగానే.. నేరుగా తన సొంత గ్రామానికి వెళ్లారు. అక్కడికెళ్లాక అనారోగ్యానికి గురి కావడంతో ఆదివారమే తిరిగి షిండే ముంబైకి చేరుకున్నారు. అయితే సోమవారం ముంబైలో ఎన్డీఏ సమావేశం జరగాల్సి ఉండగా షిండే ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. దీంతో ఎన్డీఏ సమావేశం రద్దైంది. అభ్యర్థి పేరు ప్రకటన వాయిదా పడే ఛాన్సుంది. ఇదిలా ఉంటే డిసెంబర్ 5న మహారాష్ట్ర సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని బీజేపీ ప్రకటించింది. కానీ పంచాయితీ మాత్రం ఇంకా తెగేటట్టు కనిపించడం లేదు. తాజాగా ఏక్‌నాథ్ షిండే అన్ని అపాయింట్‌మెంట్లను రద్దు చేసుకున్నారు.

ఇదిలా ఉంటే కొత్త రాష్ట్ర ప్రభుత్వంలో షిండే కుమారుడు.. శ్రీకాంత్ షిండేకు డిప్యూటీ సీఎం పదవి దక్కుతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై శ్రీకాంత్ షిండే స్పందించారు. ఊహాగానాలను కొట్టిపారేశారు. ఊహాగానాలు నిరాధారమని కొట్టిపారేశారు. ఇదిలా ఉంటే మహారాష్ట్ర సీఎం ఎంపిక కోసం కేంద్ర పరిశీలకులుగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ నియమితులయ్యారు.

మరోవైపు మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైనట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. ఆయన పేరును అధికారికంగా ప్రకటించే ఛాన్సుందని సమాచారం. కానీ షిండే ఆరోగ్యం బాగోలేనందున మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్ 2014 నుంచి 2019 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2019 అక్టోబర్‌లో రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. కేవలం మూడు రోజులు మాత్రం సీఎంగా పని చేశారు. అనంతరం ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక 2022 నుంచి మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా వ్యవహరించారు. మరోసారి బీజేపీ అత్యధిక సీట్లు సంపాదించిన కారణాన దేవేంద్ర ఫడ్నవిస్‌కి ముఖ్యమంత్రి పీఠం దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-132, షిండే శివసేన-57, ఎన్సీపీ-41, ఉద్ధవ్ థాక్రే-20, కాంగ్రెస్-16, శరద్ పవార్-10 సీట్లు సాధించాయి. అయితే షిండే వర్గం.. మహారాష్ట్రలో కూడా బీహార్ ఫార్ములా అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. బీహార్‌లో నితీష్ కుమార్‌కు సీట్లు లేకపోయినా.. ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాదే సూత్రం.. మహారాష్ట్రలో కూడా అమలు చేయాలని పట్టుబడుతోంది. అసలేం జరుగుతుందో తెలియక మహారాష్ట్ర ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.