Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘భర్తను విడిచిపెట్టినట్లు కాదు’’

  • భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘క్రూరత్వం’’కాదు..
  • భర్తను వదిలిపెట్టినట్లుగా చూడలేం..
  • విడాకుల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
Supreme Court

Supreme Court

Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘క్రూరత్వం’’, ‘‘భర్తను విడిచిపెట్టడం’’గా పరిగణించలేమని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళల ఉద్యోగ ఆశయాలను అణగదొక్కే విధంగా తీర్పులు ఇవ్వడం పాతకాలపు సామంతవా ఆలోచనలు అని సుప్రీంకోర్టు తీవ్రంగా విమర్శించింది. గుజరాత్ ఫ్యామిలీ కోర్టు, ఆ తర్వాత గుజరాత్ హైకోర్టు తీర్పులను సుప్రీంకోర్టు తీవ్రంగా విమర్శించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.

ఒక మహిళ తన కెరీర్ కొనసాగించడం వల్ల భర్త లేదా అత్తింటి వారి భావోద్వేగాలు దెబ్బగతిన్నాయనే కారణంతో దానిని ‘‘క్రూరత్వం’’గా పేర్కొనడం అభ్యంతరకరమని వ్యాఖ్యానించింది. మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్న ఈ కాలంలో ఇలాంటి ఆలోచన సమంజసం కాదని చెప్పింది.

కేసు ఏంటి.?

ఈ కేసు గుజరాత్‌కు చెందిన ఒక దంత వైద్యురాలు, భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్‌గా పని చేస్తున్న ఆమె భర్తకు సంబంధించింది. 2009లో వీరిద్దరి వివాహం జరిగింది. వివాహం తర్వాత భర్త పనిచేస్తున్న కార్గిల్‌కు వెళ్లేందుకు భార్య తన ప్రాక్టీస్ వదిలేసింది. అయితే, గర్భధారణ, కుమార్తెకు ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె అహ్మదాబాద్ వెళ్లి అక్కడే క్లినిక్ ఏర్పాటు చేసింది.

అయితే, భర్తతో ఉండకుండా, కెరీర్‌కే ప్రాధాన్యం ఇచ్చిందనే కారణంగా ఫ్యామిలీ కోర్టు వీరిద్దరికి విడాకులు మంజూరు చేసింది. భర్త ఎక్కడుంటూ భార్య కూడా అక్కడికి వెళ్లాల్సిన బాధ్యత ఉందని కింది కోర్టు పేర్కొంది. ఇదే తీర్పును గుజరాత్ హైకోర్టు కూడా సమర్థించింది. అయితే, సుప్రీంకోర్టు మాత్రం రెండు కోర్టు తీర్పుల్ని తప్పుపట్టింది. పెళ్లి తర్వాత మహిళల వ్యక్తిత్వం అంతరించిపోదని, ఆమె స్వతంత్రత భర్త ఆధీనంలో ఉండదని స్పష్టం చేసింది. మహిళలు ఇంటికే పరిమితం కావాలనే ఆలోచన ఈ కాలానికి సరిపోదని చెప్పింది.

‘‘ఒక మహిళ తన కెరీర్, పిల్లల భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయాలను క్రూరత్వంగా చూడలేమని, భర్త ఉద్యోగం కోసం మహిళ తన వృత్తిని పూర్తిగా వదిలేయాలని కోరుకోవడం మంచిది కాదు’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే, ఇద్దరి మధ్య విభేదాలు సర్దుబాటు అయ్యే అవకాశాలు లేకపోవడం, వివాహ బంధం పూర్తిగా దెబ్బతిన్నదనే కారణంతో విడాకులు ఇచ్చింది. అయితే భార్యపై క్రూరత్వం, విడిచిపెట్టడం వంటి వ్యాఖ్యల్ని తొలగించింది.