Sambhal Violence: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ లో జామా మసీదు దగ్గర సర్వే సమయంలో చెలరేగిన హింస తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో సంభాల్‌లో గల మొఘల్ కాలం నాటి షాహి జామా మసీదును సర్వే చేయాలని జిల్లా కోర్టు నవంబర్ 19న ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ మసీదు నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సివిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై ఏకపక్షంగా స్టే విధించాలని అందులో కోరారు. కాగా, జామా మసీదు కమిటీ వేసిన పిల్ ను ఈరోజు (నవంబర్ 29) సుప్రీంకోర్టు విచారించనుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.
Read Also: Off The Record: బూడిద నుంచి బంగారం పిండుకోవడానికి మొదలైన రాజకీయ రచ్చ?
అయితే, న్యాయస్థానం ఆదేశాల మేరకు నవంబర్ 19న జామా మసీదు తొలి సర్వే చేపట్టినప్పటి నుంచి సంభాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోర్టు ఈ ఆదేశాలిచ్చిన పిటిషన్‌లో గతంలో జామా మసీదు ఉన్న స్థలంలో హరిహర ఆలయం ఉండేదని పేర్కొన్నారు. ఇలాంటి ఉత్తర్వులు మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టేలా.. శాంతిభద్రతల సమస్యలను సృష్టించేలా.. దేశ లౌకిక స్వరూపాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని సుప్రీంకోర్టులో మసీద్ కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌లో వెల్లడించింది.
ఇక, నవంబర్ 24వ తేదీన సంభాల్‌లోని జామా మసీదు సర్వే సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తు చేసేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సర్కార్ ముగ్గురు సభ్యులతో కూడిన న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి దేవేంద్ర కుమార్ అరోరా అధ్యక్షతన ఏర్పాటైన కమిషన్ రెండు నెలల్లో విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అమిత్ మోహన్ ప్రసాద్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అరవింద్ కుమార్ జైన్‌లు కమిషన్‌లో సభ్యులుగా కొనసాగుతున్నారు. ఇక, గవర్నర్ సమ్మతితో ప్రభుత్వం విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసి నాలుగు అంశాలపై ఎంక్వైరీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సంఘటన హఠాత్తుగా జరిగిందా లేక ప్రణాళికాబద్ధంగా జరిగిందా లేదా నేరపూరిత కుట్ర ఫలితమా అనేదానిపై కమిషన్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనుంది. అలాగే, ఈ సంఘటన సమయంలో శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లా యంత్రాంగం, పోలీసులు చేసిన ఏర్పాట్లతో పాటు వాటికి సంబంధించిన ఇతర అంశాలపై కూడా ఈ న్యాయ కమిషన్ దర్యాప్తు చేయనుంది. హింసకు దారి తీసిన కారణాలు, నాటి పరిస్థితులపై విచారణ చేయనున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కమిషన్ ప్రభుత్వానికి సూచనలు చేయనుంది.