NTV Telugu Site icon

Supreme Court: సినిమాలకు వెళ్లేవారికి షాక్.. థియేటర్లలో బయటి ఆహారాలకు అనుమతి లేదని తీర్పు

Movie Theaters

Movie Theaters

Supreme Court:  థియేటర్లలోకి బయటి ఫుడ్ తీసుకెళ్లే విషయంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రేక్షకులు థియేటర్లకు బయటి ఫుడ్ తీసుకురావడంపై యాజమాన్యాలు ఆంక్షలు పెట్టడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. థియేటర్లు ప్రైవేట్ ప్రాపర్టీ కావడం పట్ల యాజమాన్యం నిబంధనలు పెట్టుకోవచ్చని కోర్టు సూచించింది. శిశువుల కోసం తల్లిదండ్రులు తీసుకెళ్లే ఆహారంపై మాత్రం ఎలాంటి ఆంక్షలు పెట్టడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు చీఫ్‌ జస్టీస్‌ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

Read Also: Andhra Pradesh: కొత్త ఏడాదిలో దూకుడు పెంచిన జగన్.. పార్టీలో పలు మార్పులు

2018లో జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ థియేటర్ యజమానులు, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అప్పీళ్లను కోర్టు మంగళవారం నాడు విచారించింది. థియేటర్లు ప్రైవేట్ ఆస్తులు అని.. వీటిలోకి తీసుకెళ్లే ఆహారాలపై నిషేధం విధించడంపై సినిమా హాళ్ల యజమానులకు పూర్తి హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ థియేటర్ లోపలకు బయటి నుంచి తినుబండారాలను అనుమతిస్తే.. తిన్నవారు తమ చేతులను కుర్చీలకు తుడిస్తే అనవసరంగా అవి పాడయ్యే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. అయితే థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు స్వచ్ఛమైన తాగునీరు ఉచితంగా అందించే బాధ్యత థియేటర్‌ యజమానులదేనని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.