Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం

  • ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ
  • ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
  • అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం
Supremecourt

Supremecourt

ప్రస్తుతం దేశంలో ‘వందేమాతరం గేయం’పై తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వందేమాతరంలోని ఆరు చరణాలు పాడాలని ఆదేశించింది. అయితే కాంగ్రెస్ మాత్రం ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. రెండు చరణాలే పాడతామని తీర్మానం చేసింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రస్తుతం రెండు చరణాలే పాడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. వందేమాతరంలోని ఆరు చరణాలను తప్పనిసరిగా పాడాలని కేంద్రం జారీ చేసిన సర్క్యులర్‌ను సవాలు చేస్తూ కర్ణాటక సంగీత విద్వాంసుడు టీఎం. కృష్ణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ అంశం మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. సీనియర్ అడ్వకేట్ ఎస్. మురళీధర్ మధ్య వాడీవేడి వాదనలు జరిగాయి. వందేమాతరంపై సరైన చర్చ లేకుండా.. జాతీయంగా ఏకాభిప్రాయం లేకుండా కేంద్రం ఆమోదించిందని మురళీధర్ వాదించారు. చట్టాల రూపకల్పనలో పైనుంచి కిందికి వచ్చే విధానం ద్వారా కాకుండా.. ఆదర్శవంతంగా ఇటువంటి విషయాలు ప్రజాభిప్రాయం ద్వారా రూపుదిద్దుకోవాలని మురళీధర్ కోరారు.

మురళీధర్ వ్యాఖ్యలకు తుషార్ మెహతా బదులిస్తూ.. ‘‘చట్టాల రూపకల్పన రాజ్యాంగం ప్రకారం జరుగుతుంది. నక్సలైట్ల ఆలోచనల ప్రకారం చట్టాల రూపకల్పన కుదరదు.’’ అని వ్యాఖ్యానించారు. మెహతా చేసిన నక్సలైట్ వ్యాఖ్యపై మురళీధర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నక్సలైట్ వ్యాఖ్యను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అందుకు మెహతా నిరాకరించారు. తాను చట్టాల రూపకల్పనకు సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియను మాత్రమే ప్రస్తావించానని వివరించారు. ‘‘అది రాజ్యాంగబద్ధమైన మార్గం, నక్సలైట్లు కోరుకునేది కాదు అని నేను చెప్పాను. అందుకు నేను చింతించడం లేదు.’’ అని సొలిసిటర్ జనరల్ సమర్థించుకున్నారు. ఇలాంటి వ్యాఖ్య ఒక న్యాయాధికారికి తగనిదని మురళీధర్ మరోసారి అభ్యంతరం తెలిపారు. ‘‘అతను మళ్లీ అదే పునరావృతం చేస్తున్నాడు. నేను ఇక నా అత్యంత తీవ్రమైన నిరసనను తెలియజేయబోతున్నాను.’’ అని మురళీధర్ అన్నారు.

వెంటనే న్యాయమూర్తి జయమల్య బాగ్చి జోక్యం చేసుకుంటూ… ఈ వాగ్వాదం ‘‘అనవసరమైన ఉద్రిక్తత, భావోద్వేగాన్ని’’ సృష్టించిందని అభివర్ణించారు. అయితే సొలిసిటర్ జనరల్ అటువంటి పదాన్ని ఉపయోగించి ఉండకూడదని మురళీధర్ మళ్లీ ప్రస్తావించారు. ఆయనే మొదలుపెట్టారు. సొలిసిటర్ ఇలాంటి పదాన్ని ఎందుకు వాడుతున్నారు? ఇది ఒక న్యాయాధికారికి తగనిది. ఏ న్యాయాధికారి కూడా ఈ పదాన్ని వాడటం నేను ఎప్పుడూ వినలేదు.’’ అని మురళీధర్ అన్నారు.

అనంతరం ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ జోక్యం చేసుకుని కోర్టు ముందున్న న్యాయపరమైన అంశాలపై దృష్టి సారించాలని న్యాయవాదులను కోరారు. ‘‘మనం రాజ్యాంగ వ్యాఖ్యానానికి సంబంధించిన చట్టపరమైన అంశాన్ని మాత్రమే పరిశీలిస్తున్నాం. దానికి మాత్రమే పరిమితమవుదాం.’’ అని సీజేఐ అన్నారు. మురళీధర్ జోక్యం చేసుకుని ‘‘న్యాయాధికారుల నుంచి మర్యాదను ఆశిస్తారు.’’ అని తెలిపారు. కేంద్రం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేయగా.. మురళీధర్ ఆ విషయాన్ని మళ్లీ లేవనెత్తి తన నిరసనను కూడా నమోదు చేయాలని కోరారు.

వెంటనే సొలిసిటర్ జనరల్ జోక్యం చేసుకుని తాను చేసిన వ్యాఖ్యకు కట్టుబడి ఉన్నానని మళ్లీ స్పష్టం చేశారు. ‘‘నేను చెప్పినదాన్నే మళ్ళీ చెప్పగలను. ఆ నిర్ణయం పార్లమెంటు తీసుకుంది. అది రాజ్యాంగబద్ధమైన విధానమని, నక్సలైట్లు కోరుకునేది కాదని నేను చెప్పాను. దాని గురించి నాకు ఎలాంటి విచారం లేదు.’’ మెహతా మళ్లీ వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా మరో కేసు నిమిత్తం కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే జోక్యం చేసుకుని… ‘‘స్వతంత్రంగా ఆలోచించగలగడం నక్సలైట్ కావడం కాదు..’’ అని అన్నారు. ఒకరిని నక్సలైట్‌గా ముద్ర వేసినప్పటికీ.. దానివల్ల వారి రాజ్యాంగ హక్కులు హరించుకుపోవని జస్టిస్ బాగ్చి వ్యాఖ్యానించారు. అయినా ‘‘ఒకరిని నక్సలైట్ అని ముద్ర వేసినప్పటికీ.. వారు తమ రాజ్యాంగ హక్కులను కోల్పోరు.’’ అని జస్టిస్ బాగ్చి అన్నారు. మళ్లీ సీనియర్ న్యాయవాది హెగ్డే జోక్యం చేసుకుని ‘‘ఆలోచించడం అంటే నక్సలైట్ కావడం కాదు.’’ అని బదులిచ్చారు.

తర్వాత బెంచ్ కేంద్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు చివరికి ఈ వ్యాఖ్యలను రికార్డులోకి తీసుకోలేదని.. పిటిషన్‌లో లేవనెత్తిన రాజ్యాంగపరమైన అంశాలపైనే విచారణను కొనసాగిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో వివాదం అక్కడితో ముగిసింది. తదుపరి విచారణ సమయంలో ఏం జరుగుతుందో చూడాలి.