ఒక ట్రాన్స్‌జెండర్‌కి తన అస్తిత్వాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావడం ఎంతటి విషాదమో కదా! పుట్టినప్పుడు తన శరీరానికి కేటాయించిన గుర్తింపుతో తన అంతరంగానికి సంబంధం లేదని చెప్పుకున్నందుకు, జీవితాంతం తన ఉనికికి వివరణ ఇచ్చుకోవాల్సి రావడం ఎంత కష్టమో కదా. అదే సమయంలో, మహిళల భద్రత కోసం దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న హక్కులు, రక్షణలు కూడా అంతే ముఖ్యమైనవి.
మరి ఈ రెండు వాస్తవాలు ఎదురెదురుగా నిలబడినప్పుడు, ఒకరి భయాన్ని మరొకరి అస్తిత్వానికి శిక్షగా మార్చడమే పరిష్కారమా? ఈ ప్రశ్న ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం ముందుకు వచ్చింది.
మహిళల హక్కుల పరిరక్షణ పేరుతో విమెన్స్ డిక్లరేషన్ ఇంటర్నెషనల్ ఇండియా అనే సంస్థ, ట్రాన్స్‌జెండర్ హక్కులకు సంబంధించిన చట్టంలోని కొన్ని అంశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మహిళలకు కేటాయించిన రాజకీయ రిజర్వేషన్లు, క్రీడల్లో పాల్గొనే అర్హత, జైళ్లలో వసతి, పోలీసుల తనిఖీలు, అరెస్టుల సమయంలో పాటించాల్సిన రక్షణలు లాంటివి చర్చకు వచ్చాయి.
బయోలాజికల్ మహిళల కోసం రూపొందించిన ప్రత్యేక హక్కులను జెండర్ ఐడెంటిటీ ఆధారంగా విస్తరించడం వల్ల మహిళల భద్రత, గోప్యత, రిజర్వేషన్ ప్రయోజనాలపై ప్రభావం పడవచ్చన్నది పిటిషనర్ వాదన. ట్రాన్స్‌విమెన్ హక్కులను గౌరవిస్తూనే, బయోలాజికల్ మహిళలకు ప్రత్యేకంగా కల్పించిన చట్టపరమైన రక్షణల పరిధిని స్పష్టం చేయాలని సంస్థ సుప్రీంకోర్టును కోరింది. వీటికి కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోర్టు కోరింది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. కోర్టు ప్రశ్నలను పరిశీలించడానికి అంగీకరించడం, పిటిషన్‌లోని వాదనలను అంగీకరించినట్టేనా? అస్సలు కాదు. ఇవి ఇంకా విచారణలో తేలాల్సిన అంశాలు.
కానీ ఈ చర్చకు ఒక చరిత్ర ఉంది. మహిళలకు సమాన హక్కులు దక్కాలంటే ఎంతటి పోరాటం చేయాల్సి వచ్చిందో మనకు తెలుసు. రాజకీయాల్లో ప్రాతినిధ్యం కోసం, ఉద్యోగాల్లో అవకాశాల కోసం, హింస నుంచి రక్షణ కోసం మహిళలు గొంతెత్తారు. అందుకే మహిళలకు ప్రత్యేక రక్షణలు అవసరమైన చోట వాటిని కాపాడటం అత్యంత ముఖ్యం. అయితే, అదే సమాజంలో ట్రాన్స్విమెన్ల పరిస్థితి ఏమిటి?
పాఠశాల నుంచి ఉద్యోగం వరకు, ఇంటి నుంచి ప్రజా ప్రదేశాల వరకు తమ గుర్తింపును వివరించుకోవాల్సిన పరిస్థితులు వారిని వెంటాడుతుంటాయి. ఉద్యోగ దరఖాస్తులో పురుషుడు, మహిళ అనే రెండు ఆప్షన్లే ఎక్కువగా కనిపిస్తున్నప్పుడు, తనకు సరిపోయే గుర్తింపు ఎక్కడ నమోదు చేసుకోవాలో తెలియని ట్రాన్స్జెండర్ల పరిస్థితి ఏంటి? చాలా ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు ప్రత్యేక గుర్తింపు బాక్సులు, స్పష్టమైన విధానాలు లేకపోవడం కూడా ఒక వాస్తవ సమస్య. ఉద్యోగాల్లో వివక్షను నిషేధించే చట్టం ఉండటం ఒక అడుగు కానీ ఉద్యోగావకాశాలు, నియామక విధానాలు, రిజర్వేషన్ల అమలు, సామాజిక అంగీకారం.. ఇవన్నీ ఒకే వేగంతో మారడం లేదు. అసలు ఏ రంగంలోనూ ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు సమాన అవకాశాలు అందడంలేదు. ఇప్పుడు రిజర్వేషన్ల విషయానికి వద్దాం. మహిళలకు కేటాయించిన స్థానాలు ఎవరికి వర్తించాలి? ట్రాన్స్విమెన్ల ప్రాతినిధ్యానికి ఎలాంటి వ్యవస్థ ఉండాలి? మహిళల కోసం ఏర్పడిన అవకాశాలు తగ్గకుండా, ట్రాన్స్జెండర్లు కూడా రాజకీయ ప్రాతినిధ్యం పొందే మార్గాలను ఎలా కల్పించాలి? దీని ఒక వర్గానికి అన్నీ ఇచ్చి, మరొక వర్గానికి ఏమీ మిగల్చని పోటీగా మారాల్సిన అవసరం లేదు.
ఏ వర్గానికి ఏ రక్షణ అవసరం, ఆ రక్షణ లక్ష్యం ఏంటి, దాన్ని ఎలా అమలు చేయాలి.. ఈ ప్రశ్నలకు చట్టబద్ధమైన సమాధానాలు కావాలి. ఇక జైళ్లలో ట్రాన్స్విమెన్ల పరిస్థితి మరింత తీవ్రమైనది. పురుషుడిగా గుర్తించి పురుషుల జైలుకు పంపిన ట్రాన్స్విమెన్లను అక్కడ శారీరక హింస, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. వారి ఫిర్యాదులు పట్టించుకోకపోవడం, వైద్య అవసరాలు నిర్లక్ష్యానికి గురికావడం వంటి సమస్యలూ వెలుగులోకి వచ్చాయి. పార్లమెంటరీ కమిటీ నివేదిక సైతం ట్రాన్స్‌జెండర్ ఖైదీల కోసం ప్రత్యేక వసతి, గోప్యత, భద్రత, వైద్య సంరక్షణ అవసరాన్ని ప్రస్తావించింది.
అయితే ప్రభుత్వం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని సూచించవచ్చు కానీ ఆ సదుపాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎన్ని జైళ్లలో సక్రమంగా అమలవుతున్నాయి? వాష్‌రూమ్స్, వైద్య సదుపాయాలు కూడా గౌరవంగా ఉపయోగించుకునే పరిస్థితి ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలి. ఒక ట్రాన్స్విమెన్లను మహిళల జైలులో ఉంచాలా, పురుషుల జైలులో ఉంచాలా అన్న ప్రశ్నతోనే సమస్య ముగిసిపోదు. ఆమెను ఎక్కడ ఉంచినా భద్రత, గోప్యత, వైద్యం, గౌరవం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. మహిళా ఖైదీల భద్రతను కూడా పరిగణనలోకి తీసుకుంటూ, వ్యక్తిగత ప్రమాదాలను అంచనా వేసే విధానాలు అవసరం. ఒకరి రక్షణ కోసం మరొకరిని హింసకు గురయ్యే పరిస్థితిలో వదిలేయడం న్యాయం ఎలా అవుతుంది?
క్రీడల విషయంలోనూ భావోద్వేగాలకంటే ఆధారాలే ముఖ్యం. యుక్తవయసులో హార్మోన్ల ప్రభావంతో అభివృద్ధి చెందిన కొన్ని శారీరక లక్షణాలు క్రీడా ప్రదర్శనపై ప్రభావం చూపవచ్చు. హార్మోన్ చికిత్స వల్ల కూడా శరీరంలో మార్పులు వస్తాయి. అయితే వాటి ప్రభావం వ్యక్తిని బట్టి, చికిత్స కాలాన్ని బట్టి మారుతుంది. అందుకే ప్రతి క్రీడలోని పోటీ స్వభావాన్ని, అందుబాటులో ఉన్న శాస్త్రీయ పరిశోధనలను పరిగణనలోకి తీసుకొని అర్హత ప్రమాణాలను రూపొందించాలి. మహిళల క్రీడల్లో న్యాయం కావాలనే వాదనను నిరాధారమని కొట్టిపారేయడం ఎంత తప్పో, ప్రతి ట్రాన్స్‌జెండర్‌కు ఒకే రకమైన శారీరక ప్రయోజనం ఉంటుందని భావించడం కూడా అంతే తప్పు.
ఒక వ్యక్తి క్రీడలో పాల్గొనే అర్హతపై జరిగే చర్చను ఆమె మొత్తం అస్తిత్వానికి వర్తింపజేయలేం. వైద్యశాస్త్రం, మానసిక ఆరోగ్య రంగాలు కూడా ట్రాన్స్‌జెండర్ గుర్తింపును ఒక మానసిక వ్యాధిగా పరిగణించడం లేదు. గుర్తింపు, శరీర లక్షణాలు, హార్మోన్ చికిత్స, చట్టపరమైన హక్కులు.. వీటి మధ్య తేడాలను అర్థం చేసుకోవాలి. అంతిమంగా, మహిళల హక్కులను కాపాడటం అంటే ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల ఉనికిని అనుమానించడం కావాలా? ట్రాన్స్‌జెండర్ హక్కులను గౌరవించడం అంటే మహిళల భద్రతపై వచ్చే ప్రతి ప్రశ్ననూ తిరస్కరించడం కావాలా? ఈ రెండింటి మధ్యే మన సమాజం సమాధానం వెతకాలి. ఒక మహిళ తన భద్రత గురించి మాట్లాడినప్పుడు ఆమె గొంతును వినాలి. ఒక ట్రాన్స్‌జెండర్ వ్యక్తి తనపై జరుగుతున్న వివక్ష గురించి చెప్పినప్పుడు ఆ గొంతునూ వినాలి. ఎవరి వాదనకైనా ఆధారాలు అడగాలి. ఎవరి హక్కులైనా చట్టం, న్యాయం, మానవ గౌరవం అనే ప్రమాణాలతో పరిశీలించాలి.
ఎందుకంటే హక్కులు అనేవి ఎవరో ఒకరు గెలిస్తే మరొకరు ఓడిపోయే బహుమతులు కావు. ఒకరి భద్రత కోసం మరొకరి జీవితాన్ని చీకటిలోకి నెట్టాల్సిన అవసరం లేని సమాజాన్ని నిర్మించడమే అసలు లక్ష్యం. మహిళల హక్కులకూ గౌరవం ఉండాలి. ట్రాన్స్‌జెండర్ అస్తిత్వానికీ గౌరవం ఉండాలి. ఈ రెండింటి మధ్య న్యాయం నిలబడాలంటే, మన నిర్ణయాలకు భయం పునాది కాకూడదు. వాస్తవాలు, శాస్త్రీయ ఆధారాలు, రాజ్యాంగ విలువలే పునాది కావాలి.

