ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టు ఇవాళ మరోసారి విచారణ జరపనుంది. ఈ ఘటనపై దసరా పండగ ముందు విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ ధర్మాసనం.. యూపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దయచేసి విచారణకు హాజరుకండి అంటూ నిందితుడికి సీఆర్‌పీసీ-160 కింద పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని తప్పు పట్టింది. మిగతా కేసుల్లో నిందితుల విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తారా? అని నిలదీసింది. కాగా, లఖింపూర్ ఉద్రిక్తతల్లో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఉన్నతస్థాయి న్యాయ విచారణ జరపాలంటూ… యూపీకి చెందిన లాయర్లు శివకుమార్ త్రిపాఠి, సీఎస్ పాండా సీజేఐకి లేఖలు రాశారు. వీరి అభ్యర్థనను స్వీకరించిన జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ నెల 8వ తేదీని విచారణ జరిపింది. హింసకు కారణమైన నిందితుల పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది.
లఖింపూర్ ఘటన.. సుప్రీంకోర్టు విచారణపై ఉత్కంఠ
