Supreme Court to hear Gyanvapi mosque case on November 10: జ్ఞానవాపీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు కీలక విచారణ జరపనుంది. నవంబర్ 10న ఈ అంశం సుప్రీం ధర్మాసనం ముందుకు రానుంది. ఇప్పటికే ఈ కేసును వారణాసి జిల్లా కోర్టు విచారిస్తోంది. వీడియో సర్వేలో జ్ఞానవాపీ మసీదులో లభించిన శివలింగాన్ని పరిరక్షించాలని మే నెలలో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో పాటు ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఆదేశించింది.ఈ ఆదేశాల తరువాత మళ్లీ ఇప్పుడే సుప్రీంకోర్టు ఈ అంశాన్ని విచారించనుంది.
నవంబర్ 12 నాటికి సుప్రీంకోర్టు ఇచ్చిన రక్షణ గడువు ముగుస్తున్న నేపథ్యంలో నవంబర్ 10నే సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. జ్ఞానవాపీ మసీదు వెలుపలి గోడలపై హిందూ దేవీదేవతా మూర్తుల ఆనవాళ్లు ఉన్నాయని మాకు పూజించుకునేందు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఐదుగురు మహిళలు కోర్టును ఆశ్రయించారు. వీరి తరుపున వాదిస్తున్న న్యాయవాది విష్ణు జైన్ గడువు ముగియకముందే ఈ సమస్యను లిస్ట్ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయవాదులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం నవంబర్ 10న స్పెషల్ లీవ్ పిటిషన్ విచారించేందుకు లిస్ట్ చేయాలని ఆదేశించారు.
Read Also: Rambha Family Car Accident: హీరోయిన్ రంభ ఫ్యామిలీకి యాక్సిడెంట్.. పిల్లలతో వెళ్తుండగా ప్రమాదం
కాశీ విశ్వనాథ్ కాంప్లెక్స్ ను ఆనుకుని ఉన్న జ్ఞానవాపీ మసీదును వీడియోగ్రఫీ సర్వే చేయాలని ట్రయల్ కోర్టు ఆదేశించిన తర్వాత, కోర్టు కమిషనర్ల పరిధిలో మే 17న, మసీదు లోపల వాజూఖానాలో ఓ కొలనులో శివలింగం ఆకృతిలో ఉన్న ఆకారాన్ని కనుక్కున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు, శివలింగం లభించిన ప్రాంతాన్ని రక్షించాలని వారణాసి డీఎంకు ఆదేశాలు ఇచ్చింది. ఇదిలా ఉంటే అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ హిందూ పక్షం వాదనలను తోసిపుచ్చింది. శివలింగం ఆకారం ఫౌంటెన్ అని చెబుతోంది. దీంతో పాటు ప్రార్థనాస్థలాల చట్టం 1991 ప్రకారం ఇది ప్రార్థనా స్థలాల స్థితిని మార్చే వీలు లేదని వాదిస్తోంది. అయితే ఈ కేసును విచారిస్తున్న వారణాసి జిల్లా కోర్టు మాత్రం జ్ఞానవాపీ మసీదు ఈ చట్టం కిందికి రాదని కీలక తీర్పును వెల్లడించింది.