NTV Telugu Site icon

Supreme Court: సుప్రీంకోర్టు పనివేళలు మారతాయా?.. సీనియర్ జడ్జి కీలక వ్యాఖ్యలు.

Sci

Sci

సుప్రీంకోర్ట్‌ పనివేళలు మారతాయా అంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు ఇవాళ చేసిన వ్యాఖ్యలు ఇదే ఆలోచనను రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం మన దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జడ్జిలు కేసులపై విచారణలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ రోజు జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఎస్‌.రవీంద్రభట్‌, జస్టిస్‌ సుధాంశు ధులియాలతో కూడిన ధర్మాసనం ఓ గంట ముందే విచారణలు ప్రారంభించింది.

వాదనలు వినిపించేందుకు వచ్చిన సీనియర్‌ అడ్వకేట్‌ ముకుల్‌ రోహత్గి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ధర్మాసనం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దీంతో జస్టిస్‌ లలిత్‌ స్పందిస్తూ.. ‘నా ఉద్దేశం ప్రకారం మనం రోజూ ఉదయం 9 గంటలకే విచారణలు ప్రారంభించొచ్చు. మన పిల్లలు పొద్దున్నే 7 గంటలకే స్కూల్‌కి వెళుతున్నప్పుడు మనం కనీసం 9 గంటలకైనా పని మొదలుపెట్టలేమా అని నాకెప్పుడూ అనిపిస్తుంటుంది’ అన్నారు. ‘నేనైతే.. ఈ రోజు మాదిరిగానే రోజూ చేయాలంటాను. కోర్టులు తెరిచేందుకు ఉదయం తొమ్మిదిన్నరే సరైన సమయమనిపిస్తోంది’ అని రోహత్గి కూడా జస్టిస్‌ లలిత్‌కి సపోర్ట్‌గా మాట్లాడారు.

‘విచారణలను ఎర్లీగా స్టార్ట్‌ చేస్తే ఎర్లీగానే ముగించొచ్చు. తర్వాతి రోజు విచారణకు రానున్న కేసుల ఫైల్స్‌ చదివేందుకు కూడా సమయం దొరుకుతుంది. ఉదయం 9 గంటలకు విధులను ఆరంభిస్తే పదకొండున్నరకు బ్రేక్‌ ఇవ్వొచ్చు. అర్ధ గంట బ్రేక్‌ తర్వాత మళ్లీ ప్రారంభించి మధ్యాహ్నం రెండు గంటల కల్లా ముగించొచ్చు. లంచ్‌ తర్వాత సాయంత్రం మరిన్ని పనులు చేసేందుకు న్యాయమూర్తులకు అదనపు సమయం లభిస్తుంది’ అని లలిత్‌ అభిప్రాయపడ్డారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీ లిస్టులో జస్టిస్‌ లలిత్‌ టాప్‌లో ఉన్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ (ఆగస్ట్‌ 26న) రిటైర్‌ అయితే తదుపరి చీఫ్‌ జస్టిస్‌గా జస్టిస్‌ లలిత్‌ బాధ్యతలు చేపడతారు. నవంబర్‌ 8 వరకు ఆ పదవిలో ఉంటారు. ఈ నేపథ్యంలో జస్టిస్‌ లలిత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆయన గనక సుప్రీంకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌ అయితే కొత్త పనివేళలకు తెరతీస్తారేమోననే టాక్‌ వినిపిస్తోంది.