పెగాసస్ స్కామ్ వ్యవహారం భారత రాజకీయాలను ఓ కుదుపు కుదిపింది.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొత్తం పెగాసస్ వ్యవహారంలో అట్టుడికిపోయాయి. ఇక, ఈ వ్యవహారంలో విచారణకు ద్విసభ్య కమిషన్ వేసి.. పెగాసస్‌పై విచారణకు పూనుకున్న తొలి రాష్ట్రంగా వార్తల్లోని నిలిచింది పశ్చిమబెంగాల్.. అయితే, ఇవాళ కేంద్రంతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.. ద్విసభ్య కమిషన్ విచారణ నిలుపుదల చేయాలంటూ “ప్రజా ప్రయోజన వ్యాజ్యం” దాఖలు అయ్యింది.. జస్టిస్ మదన్ బీ లోకూర్ నేతృత్వంలో ఇద్దరు సభ్యుల కమిషన్ విచారణను నిలుపుదల చేయాలన్న అభ్లర్ధనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు.. పెగాసస్ కుంభకోణం పై విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన ఇతర పిటిషన్లతో కలిపి విచారణ జరుపుతామన్నారు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి..
పెగాసస్ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి రాష్ట్రం విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు.. ఇవాళ కేంద్రం మరియు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి వివరణ కోరింది. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై కేంద్రానికి మరియు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.. తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.
