Site icon NTV Telugu

Sena Vs Sena: థాక్రే వర్సెస్ షిండే.. ఆ పిటిషన్లు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ

Eknath Shinde And Uddav Thackeray

Eknath Shinde And Uddav Thackeray

Sena Vs Sena: శివసేన పార్టీ చీలిక నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే వర్గం దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌లను ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి బదిలీ చేసి, ఈ కేసును ఆగస్టు 25న బెంచ్ విచారించనున్నట్లు తెలిపింది.’నిజమైన శివసేన’ పార్టీగా గుర్తించి, దానికి ”విల్లు, బాణం” గుర్తును కేటాయించాలంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే క్యాంప్ దాఖలు చేసిన దరఖాస్తుపై ఆగస్టు 25 వరకు నిర్ణయం తీసుకోవద్దని సుప్రీంకోర్టు భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

మహారాష్ట్రలో థాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి దారితీసిన రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. శివసేనకు చెందిన ఇరువర్గాలు దాఖలు చేసిన పలు పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది. వీటిపై సుప్రీం కోర్టులో విచారణ పెండింగ్‌లో ఉండగానే.. అసలైన శివసేన పార్టీ తమదేనని చెబుతూ షిండే వర్గం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. పార్టీ నియంత్రణ, ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’ తమకే కేటాయించాలని కోరింది. అయితే, దీన్ని ఠాక్రే వర్గం వ్యతిరేకించింది. సుప్రీంకోర్టులో విచారణ పూర్తికానుందన షిండే వినతిపై తదుపరి చర్యలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేసింది.

Arms Recovered: ఇండో-పాక్ సరిహద్దులో భారీగా ఆయుధాలు పట్టివేత

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో ఉన్న కొన్ని అంశాల పరిశీలనకు రాజ్యాంగ ధర్మాసనం అవసరమని గతంలో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. పిటిషన్లపై రాజ్యాంగపరమైన ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో దీనిపై విస్తృత ధర్మాసనం ఏర్పాటు అవసరమని గతంలో సీజేఐ జస్టిస్ ఎన్​వీ రమణ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. శివసేన సభ్యులపై జారీ చేసిన కొత్త అనర్హత నోటీసులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌ను సుప్రీం కోరింది. శివసేనకు చెందిన ఇరువర్గాలు దాఖలు చేసిన వివిధ పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పిటిషన్లు అన్నింటిని త్రిసభ్య ధర్మాసనం రాజ్యాంగ ధర్మాసనానికి బదలీ చేసింది.

Exit mobile version