Right To Die: ‘‘మరణించే హక్కు’’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. హరీష్ రాణా ఇక ప్రశాంతంగా చనిపోవచ్చు..

  • మరణించే హక్కుపై సుప్రీం కోర్టు కీలక తీర్పు..
  • హరీష్ రాణా ఇక ప్రశాంతంగా చనిపోవచ్చు..
Harish Rana

Harish Rana

Right To Die: ‘‘మరణించే హక్కు’’పై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చెప్పింది. గత 13 ఏళ్లుగా అకస్మారక స్థితిలో ఉన్న 31 ఏళ్ల హరీష్ రాణా ప్రశాంతంగా చనిపోయేందుకు అనుమతిచ్చింది. హరీష్ తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ‘‘లైఫ్ సపోర్ట్’’ విత్ డ్రా చేసుకోవడానికి అనుమతినిచ్చింది. రోగి పరిస్థితిపై రెండు వైద్య బోర్డుల అభిప్రాయాలను సుప్రీంకోర్టు అధ్యయనం చేసిన తర్వాత ‘‘పాసివ్ యుథనేషియా’’ (నిష్క్రియ కారుణ్యమరణం)పై చట్టం తీసుకురావాలని కేంద్రాన్ని కోరింది.

2013లో పంజాబ్ యూనివర్సిటీ విద్యార్థి హరీష్ రాణా పెయింగ్ గెస్ట్ హౌజ్ నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు పడి తీవ్రగాయాలపాలయ్యారు. అప్పటి నుంచి అతడికి లైఫ్ సపోర్ట్ అందించారు. అతడి శ్వాస కోసం ట్రాకియోస్టమీ ట్యూబ్, ఆహారం కోసం గ్యాస్ట్రోజెజునోస్టమీ ట్యూబ్‌తో మంచానికి పరిమితమయ్యారు. అప్పటి నుంచి హరీష్ రాణా తల్లిదండ్రులు కొడుకుకు నిస్వార్థ సేవల్ని అందిస్తున్నారు.

Read Also: Gautam Gambhir: డారిల్ మిచెల్‌కు అర్ష్‌దీప్‌ సారీ చెప్పనక్కర్లేదు.. గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె.వి. విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం తమ ఉత్తర్వుల్లో.. ‘‘దేవుడు ఎవరిని అడిగి ప్రాణం ఇవ్వడు, మనిషి దానిని స్వీకరించాలి’’ అని చెప్పారు. వ్యక్తులు చనిపోవడాన్ని ఎంచుకోవచ్చా అనే విషయంపై షేక్స్‌పియర్ రాసిన ‘హామ్లెట్’ లోని “జీవించాలా లేక మరణించాలా” (To be or not to be) అనే ప్రసిద్ధ వాక్యాన్ని కూడా ప్రస్తావించారు. లైఫ్ సపోర్ట్ ఉపసంహరణ రెండు కారణాలపై ఆధారపడి ఉండాలని కోర్టు పేర్కొంది. అది వైద్యపరమైన చికిత్సగా పరిగణించబడాలని, రోగి ఉత్తమర ప్రయోజనాల దృష్ట్యా ఉండాలని చెప్పింది. రోగి కోలుకునే అవకాశం లేనప్పుడు, చికిత్స కొనసాగించాల్సిన బాధ్యత వైద్యుడిపై ఉండదని కోర్టు స్పష్టం చేసింది.

Read Also: ICC T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లోనూ భారత్ డామినేషన్.. అభిషేక్, ఇషాన్ కిషన్ అరాచకం!

గత 13 ఏళ్లుగా హరీష్ ఆరోగ్యంలో ఎలాంటి మార్పు రాలేదని కోర్టు తెలిపింది. రోగికి చికిత్స చేయడమే వైద్యుడి విధి, రోగి కోలుకునే అవకాశం లేనప్పుడు ఆ విధిని కోనసాగించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. హరీష్ వైద్య చికిత్సను ఉపసంహరించేలా ఎయిమ్స్ రోగికి పాలియేటివ్ కేర్‌లో ప్రవేశం కల్పించాలని కోర్టు పేర్కొంది. గౌరవం కాపాడుకునేలా తగిన ప్రణాళికతో దానిని ఉపసంహరించుకోవాలని ఆదేశించింది.

రాణా కుటుంబం, ఆయన తల్లిదండ్రులు నిస్వార్థ సేవల్ని కోర్టు కొనియాడింది. ‘‘అతని కుటుంబం ఎప్పుడూ అతని వైపు నుండి దూరంగా లేదు… ఒకరిని ప్రేమించడం అంటే చీకటి సమయాల్లో కూడా వారిని చూసుకోవడమే.’’ అని పేర్కొంది. 2011లో అరుణా షాన్‌బాగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పులో భారతదేశం అసాధారణ పరిస్థితుల్లో కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేసింది. షాన్‌బాగ్ అనే నర్సుపై లైంగిక దాడి తర్వాత, 40 ఏళ్ల పాటు కోమాలో ఉంది.