Supreme Court: ఉరిశిక్షకు బదులుగా ఇంజెక్షన్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..

  • ఉరిశిక్ష విధానాన్ని మార్చాలన్న పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు.
  • ఉరికి బదులుగా లెథల్ ఇంజెక్షన్ తదితర పద్ధతులు తీసుకురావాలని పిటిషన్‌.
Supreme Court

Supreme Court

Supreme Court: మరణశిక్ష పడిన ఖైదీలకు ప్రస్తుతం అమలు చేస్తున్న ఉరిశిక్ష విధానాన్ని తొలగించి, (లెథల్ ఇంజెక్షన్) ప్రాణాంతక ఇంజెక్షన్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. అయితే, ఉరిశిక్ష అమలు చేసే ప్రస్తుతం విధానంపై సమగ్ర సమీక్ష జరిపేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అడ్డంకి లేదని కోర్టు స్పష్టం చేసింది.

మరణ శిక్ష అమలులో ఉరి ద్వారా వచ్చే అనవసరమైన బాధను తొలగిస్తూ, దోషిగా తేలిన ఖైదీ గౌరవాన్ని కాపాడే ప్రత్యామ్నాయ పద్ధతి ఏదైనా ఉందా అనే అంశాన్ని నిపుణుల కమిటీ ద్వారా కేంద్ర పరిశీలించవచ్చని ధర్మాసనం పేర్కొంది. సీనియర్ న్యాయవాది రిషి మల్హోత్రా ఈ పిటిషన్‌ను 2017లో దాఖలు చేశారు. మరణశిక్ష అమలు కోసం ఉరిని చట్టం నుంచి తొలగించి, తక్కువ బాధ కలిగించే పద్ధతుల్ని ప్రవేశపెట్టాలని ఆయన కోరారు. లెథల్ ఇంజెక్షన్, కరెంట్ షాక్, గ్యాస్ చాంబర్ వంటి విధానాలను ప్రత్యామ్నాయాలుగా పిటిషన్‌లో ప్రస్తావించారు. మరణశిక్ష పడిన ఖైదీకి ఉరి లేదా లెథన్ ఇంజెక్షన్ వంటి విధానాల్లో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఇవ్వాలని మల్హోత్రా వాదించారు.

2023 మార్చిలో సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధానం సముచితమైందా.? తక్కువ బాధ కలిగించేదా అనే అంశాన్ని పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ అంశంపై కేంద్రం నుంచి సమాచారం కోరింది. అయితే, శిక్ష విధించే విధానాల్లో ఏదో ఒక నిర్దిష్ట పద్ధతిని అమలు చేయాలని పార్లమెంట్‌ను ఆదేశించి అధికారొం తమకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2018లో కేంద్రం ఉరిశిక్ష విధానాన్ని సమర్థించింది. లెథల్ ఇంజెక్షన్, కాల్చడం వంటి ఇతర పద్ధతులు ఉరి కన్నా తక్కువ బాధకరమైనవని నిరూపించే తగిన ఆధారాలు లేవని పేర్కొంది. ఉరి విధానం వేగవంతమైనదని, సరళమైనదని కేంద్రం అప్పట్లో అఫిడవిట్‌లో తెలిపింది.