Site icon NTV Telugu

Rahul Gandhi: ‘‘చైనా 2,000 కి.మీ భూమిని ఆక్రమించిందని మీకెలా తెలుసు.?’’ రాహుల్ గాంధీపై సుప్రీం ఆగ్రహం..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: భారత సైన్యం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందరకు కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసుల దాఖలైంది. అయితే, ఈ కేసును కొట్టివేయాలని రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘‘చైనా 2000 కి.మీ భూమిని ఆక్రమించిందని మీకు ఎలా తెలుసు..? నిజమైన భారతీయులు ఇలాంటి వ్యాఖ్యలు చేయరు’’ అని జస్టిస్ దత్తా రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023లో భారత్ జోడో యాత్ర సందర్భంగా, చైనా భారతదేశానికి సంబంధించిన 2000 కి.మీ భూమిని ఆక్రమించిందని ఒక ఆర్మీ ఆఫీసర్ తనతో చెప్పారని రాహుల్ గాంధీ అన్నారు. ఈ వాఖ్యలపై పరువు నష్టం కేసు దాఖలైంది. ఈ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఆయనపై మండిపడింది.

Read Also: Anil kumar yadav: డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరైన మాజీ మంత్రి అనిల్

2020 జూన్‌లో లడఖ్‌లోని గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన హింసాత్మక ఘర్షణ గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలను జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎజి మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం తీవ్రంగా వ్యతిరేకించింది. చైనా ముందు నరేంద్రమోడీ ప్రభుత్వం లొంగిపోయిందని రాహుల్ గాంధీ ఆ సమయంలో ఆరోపించారు. పరువు నష్టం కేసును రద్దు చేయాలన్న రాహుల్ గాంధీ విజ్ఞప్తికి వ్యతిరేకంగా కోర్టు నోటీసు జారీ చేసింది.

అయితే, రాహుల్ గాంధీ తరుపున విచారణకు హాజరైన న్యాయవాది అభిషేక్ సింఘ్వీ తన వాదనలను వినిపిస్తూ.. ‘‘ఆయన ఈ విషయాలు చెప్పలేకపోతే ప్రతిపక్ష నాయకుడు ఎలా అవుతారు..?’’ అని అడిగారు. దీనికి ప్రతిగా, ‘‘అలాంటప్పుడు ఈ విషయాలను పార్లమెంట్‌లో ఎందుకు చెప్పరు..? సోషల్ మీడియాలో ఎందుకు చెప్పాలి..?’’ అని జస్టిస్ దత్తా ప్రశ్నించారు.

Exit mobile version