NTV Telugu Site icon

Supreme Court: ఆర్టీసీ ప్రమాదంపై సంచలన తీర్పు.. బాధిత కుటుంబానికి రూ.9 కోట్లు ఇవ్వాలని ఆదేశం

Supreme Court

Supreme Court

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఆర్టీసీ ప్రమాదంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఆర్టీసీ బస్సు ప్రమాదంలో చనిపోయిన మహిళ కుటుంబానికి రూ.9,64,52,220 పరిహారాన్ని చెల్లించాలని ఏపీఎస్‌ఆర్టీసీకి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం జస్టిస్‌ సంజయ్‌కరోల్, జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రలతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది.

ఇది కూడా చదవండి: Aghathiyaa: అంతుచిక్కని రహస్యంతో ‘అఘత్యా’ ట్రైలర్..

అమెరికా పౌరసత్వం కలిగిన లక్ష్మీ నాగళ్ల అనే మహిళ 2009 జూన్‌ 13న భర్త, ఇద్దరు కుమార్తెలతో కలిసి కారులో అన్నవరం నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఆ ప్రమాదంలో లక్ష్మీ నాగళ్ల మృతి చెందింది. అయితే ఆమె మరణంపై భర్త శ్యాంప్రసాద్‌ నాగళ్ల సికింద్రాబాద్‌ మోటార్‌ యాక్సిడెంట్స్‌ ట్రైబ్యునల్‌లో కేసు వేశారు. అమెరికాలోనే కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ చేసి.. అక్కడే తన భార్య నెలకు 11,600 డాలర్లు సంపాదిస్తున్నారని, ఆమె మరణానికి కారణమైన ఆర్టీసీ నుంచి రూ.9 కోట్ల పరిహారం ఇప్పించాలని మృతురాలి భర్త కోరారు. వాదనలు విన్న ట్రైబ్యునల్‌ రూ.8.05 కోట్ల పరిహారం చెల్లించాలని ఆర్టీసీని 2014లో ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆర్టీసీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం రూ.5.75 కోట్లు చెల్లించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ మృతురాలి భర్త సుప్రీంకోర్టుకు వెళ్లగా.. రూ.9,64,52,220 పరిహారం కింద చెల్లించాలని ఏపీఎస్‌ఆర్టీసీని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఇది కూడా చదవండి: Rahul Gandhi : భారత సైన్యంపై చేసిన వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు